UP School Incident:


తాత్కాలికంగా పాఠశాల బంద్ 


యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ స్కూల్‌ టీచర్‌ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన సంచలనమైంది. ఈ వీడియో వైరల్ అవడం వల్ల ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో స్కూల్‌ని బంద్ చేయాలని యోగి సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే విద్యాశాఖ కూడా ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టింది. స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు పంపింది. స్కూల్ బంద్ చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్థానిక పాఠశాలల్లో వాళ్లందరికీ తాత్కాలిక అడ్మిషన్‌లు ఇచ్చారు. మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకూ స్కూల్‌ని ఓపెన్ చేయకూడదని అధికారులు తేల్చి చెప్పారు. నిందితురాలు తృప్తి త్యాగి మాత్రం తన చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఇది చాలా చిన్న విషయం అని కొట్టి పారేస్తున్నారు. కేవలం హోం వర్క్ చేయలేదన్న కారణంగానే విద్యార్థులతో కొట్టించానని, ఇందులో మతపరమైన వివక్ష ఏమీ లేదని తేల్చి చెబుతున్నారు. తల్లిదండ్రులే తమ కొడుకుని కాస్త మందలించాలని కోరినట్టు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు తృప్తి త్యాగి. 


"ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా పెద్దది చేస్తున్నారు. ఆ స్టూడెంట్ హోం వర్క్ చేయలేదన్న కోపంతోనే తోటి విద్యార్థులతో కొట్టించాను. అంతే తప్ప ఇందులో ఎలాంటి మతపరమైన వివక్ష లేదు. నేను దివ్యాంగురాలిని. నేను కొట్టలేను కాబట్టే విద్యార్థులతో ఆ పని చేయించాను. తల్లిదండ్రులే చాలా సార్లు తమ కొడుకు గురించి చెప్పారు. కాస్త మందలించమని కోరారు. అందుకే కాస్త కఠినంగా ఉండాలని, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో అలా చేశాను"


- తృప్తి త్యాగి, ఉపాధ్యాయురాలు 


తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ 


ఆ ముస్లిం విద్యార్థి తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇచ్చారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు. ఈ ఘటన జరిగిన రోజు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడం వల్ల అధికారుల దృష్టికి వెళ్లింది. వాళ్లు విచారణ మొదలు పెట్టాక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 


"మా అబ్బాయికి ఏడేళ్లు. ఆగస్టు 24న ఈ ఘటన జరిగింది. తోటి విద్యార్థులతో నా కొడుకుని పదేపదే కొట్టించింది. దాదాపు రెండు గంటల పాటు వాడిని తీవ్రంగా హింసించింది. ఇప్పటికీ వాడు ఆ భయంతోనే ఉన్నాడు"


- విద్యార్థి తల్లిదండ్రులు 


ఖబర్‌పూర్‌ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోలో టీచర్‌ ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. క్లాస్‌లో ఉన్న విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని కొట్టాలని ఆదేశించింది. టీచర్‌ చెప్పినట్టుగానే విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని చెంపపై కొట్టారు. ఇలా కొడుతూ ఉండగా చైర్‌లో కూర్చున్న టీచర్ "ఇంకా గట్టిగా కొట్టండి" అంటూ ఆర్డర్‌ వేసింది. ఓ స్టూడెంట్‌ చెంపమీద కొట్టినా ఆగకుండా...నడుముపైన కొట్టండి అంటూ కుర్చీలో కూర్చుని ఆర్డర్‌లు వేసింది ఆ మహిళా టీచర్. 


Also Read: చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలివే, మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో