Chandrayaan-3:
భద్రకాళి ఆలయంలో పూజలు..
చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అయిన నాలుగు రోజుల తరవాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కేరళలోని తిరువనంతపురం పర్యటనకు వెళ్లారు. అక్కడి పౌర్ణమికవు భద్రకాళి ఆలయంలో పూజలు చేశారు. చంద్రయాన్ మిషన్ విజయవంతం అయినందుకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చరిత్ర సృష్టించిన ఇస్రో..
ఆగస్టు 23న ఇస్రో చరిత్ర సృష్టించింది. చంద్రుడి ఉపరితలంపై ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయింది. అది కూడా అత్యంక సంక్లిష్టమైన వాతావరణం ఉండే దక్షిణ ధ్రువంపై. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు రష్యా లూనా-25 ప్రయోగం చేసినా చంద్రుడి ఉపరితలంపై రోవర్ క్రాష్ అయింది. ఫలితంగా...ఆ మిషన్ విఫలమైంది. ఆ తరవాత భారత్ చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి ఉపరితలంపై అనుకున్న చోట దిగింది. ఇప్పటి వరకూ చంద్రుడిపై అడుగు పెట్టిన దేశాల జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది భారత్. ప్రజ్ఞాన్ రోవర్ దిగిన చోటుని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రధాని మోదీ విజన్‌కి అనుగుణంగా పని చేస్తున్నామని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. అయితే...చంద్రయాన్ 3 సక్సెస్ తరవాత అన్ని దేశాల చూపు భారత్ వైపు పడింది. ఇకపై ఇస్రో చేపట్టే ప్రతి ప్రాజెక్ట్‌పైనా అంచనాలు పెరగనున్నాయి. చంద్రుడిపై ల్యాండింగ్ అయిన తరవాత ఇప్పుడు సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమైంది ఇస్రో. Aditya-L1 మిషన్ ద్వారా అక్కడి పరిస్థితులను పరిశీలించనుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఆదిత్య మిషన్ మొదలు కానుంది. సూర్యుడిపై పరిశోధనలకు భారత్ తయారు చేసిన తొలి ఉపగ్రహం ఇదే.
"Aditya L1 శాటిలైట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. శ్రీహరికోటకు తీసుకురావడం PSLV కి అనుసంధానిచడం అంతా పూర్తైంది. ఇక లాంఛ్ చేయడమొక్కటే మిగిలి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో లాంఛ్ చేయనున్నాం. మరో రెండు మూడు రోజుల్లో తేదీని ఖరారు చేస్తాం. ఈ ప్రయోగం తరవాత ఈ శాటిలైట్ అనుకున్న కక్ష్యలోకి చేరుతుంది. అక్కడి నుంచి L1 పాయింట్ వరకూ ట్రావెల్ చేస్తుంది. ఇందుకు దాదాపు 120 రోజుల సమయం పడుతుంది"
- ఇస్రో చీఫ్ సోమనాథ్
ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇస్రో మొత్తం మూడు లక్ష్యాలను నిర్దేశించుకుందని అందులో చంద్రయాన్ పూర్తైందని వెల్లడించారు. రానున్న 14 రోజులు ఈ మిషన్‌లో చాలా కీలకమని చెప్పారు. మరో రెండు మిషన్స్ గురించీ ప్రస్తావించారు. భారత్‌కి చంద్రుడిపై వెళ్లే సామర్థ్యం ఉందని తేల్చి చెప్పిన సోమనాథ్...మార్స్, వీనస్‌పైకి వెళ్లే కెపాసిటీ కూడా ఇండియాకి ఉందని..కాకపోతే మరింత ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని అన్నారు. అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరాన్నీ గుర్తు చేశారు. చంద్రయాన్ 3 సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు సోమ్‌నాథ్. అనుకున్న లక్ష్యాలు సాధించగలిగామని వెల్లడించారు. వచ్చే 14 రోజుల్లో చంద్రుడి నుంచి కీలకమైన సమాచారం తెలుసుకోవచ్చని వివరించారు.
Also Read: ఢిల్లీ మెట్రో స్టేషన్‌ల గోడలపై ఖలిస్థాన్ నినాదాలు, అలెర్ట్ అయిన పోలీసులు