B20 Summit 2023: ఢిల్లీలో జరుగుతున్న బి20 సదస్సు 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. మూడ్రోజుల నుంచి జరుగుతున్న ఈ సదస్సులో ఆదివారం రోజు మధ్యాహ్నం బి20 సదస్సులో ప్రధాని పాల్గొని మాట్లాడనున్నారు. శుక్రవారం (ఆగస్టు 25) ప్రారంభమైన మూడ్రోజుల సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు, నిపుణులు, వివిధ దేశాలకు చెందిన 1700 గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాల్గొంటున్నారు. G20  ఫోరమ్ అయిన బిజినెస్ 20 (బి20) బ్యానర్ కింద ఈ సదస్సు సమావేశం అవుతోంది. బి20 ప్లాట్‌ఫారమ్‌ వ్యాపార ప్రపంచంలో పని చేసే అనేక రకాల వాటాదారులను ఒక చోట చేర్చే అద్భుతమైన వేదిక అని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే జి20 సమ్మిట్ వచ్చే నెలలో జరగనున్న విషయం తెలిసిందే.


'ఆగస్టు 27న, మధ్యాహ్నం 12 గంటలకు, నేను బి20 సమ్మిట్ ఇండియా 2023లో ప్రసంగిస్తాను. ఈ ప్లాట్‌ఫారమ్ వ్యాపార ప్రపంచంలో పని చేస్తున్న అనేక మంది వాటాదారులను ఒక చోట చేర్చుతుంది. ఆర్థిక వృద్ధిని పెంచడంపై జి20 దేశాలు స్పష్టమైన దృష్టితో తీసుకువచ్చిన వేదిక ఇది' అని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.






బి20 థీమ్, ఫ్రేమ్‌వర్క్‌


బాధ్యతాయుతమైన, వినూత్నమైన, స్థిరమైన, సమానమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడమే ఈ బి20 థీమ్ అని బి20 సమ్మిట్ కు ఛైర్ గా వ్యవహరిస్తున్న ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. బి20 ఫ్రేమ్‌వర్క్‌ లో 9 థీమ్ లు, 7 టాస్క్‌ఫోర్స్‌ లు, రెండు యాక్షన్ కౌన్సిల్‌లు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సొసైటీ, గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా వీటిని రూపొందించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా వాడుకోవడంపై బి20లోని ఓ టాస్క్‌ఫోర్స్‌ దృష్టి కేంద్రీకరిస్తోంది.


బి20 సమ్మిట్ ప్రారంభ సెషన్ ను ఉద్దేశించి శుక్రవారం బి20 ఛైర్, టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భారతదేశ పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అభివృద్ధి ప్రయాణం ప్రపంచ భవిష్యత్తును నిర్దేశిస్తుందని అన్నారు. ఏఐ దేశంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు. ఇది తక్కువ లేదా నైపుణ్యం లేని ఎక్కువ మందికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి సాధికారతను ఇస్తుందని తెలిపారు. భారత్ టెక్నో-లీగల్ విధానాన్ని తీసుకోవడం ద్వారా డేటా గోప్యత, రక్షణకు సంబంధించి అద్భుతమైన పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు.


దేశంలో వందల మిలియన్ల మంది ప్రజలకు ఏఐ అందుబాటులోకి రావాలనేది తమ భావన అనీ, ప్రజలు మార్కెట్ లోకి రాబోతున్న 250-300 మిలియన్ల మంది రానున్నారని చెప్పారు. వారికి ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తే మొత్తం జీడీపీని ప్రభావితం చేస్తుందని, అలాగే వారి తలసరి ఆదాయం పెరగడం లాంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చంద్రశేఖరన్ చెప్పారు. అలాగే భారత్ ఐటీ చట్టం ద్వారా డేటా ప్రైవసీ, రక్షణ విషయంలో పెద్ద పురోగతి సాధించిందని, మరోవైపు తాము సృష్టించిన డెపా రెండూ కలిసి పని చేయడం మంచి పరిణామంగా చెప్పారు. కాగా.. జి20 18వ సదస్సు భారత్ వేదికగా.. వచ్చే నెలలో జరగనుంది.