Lok Sabah Election 2024:


రూట్‌మ్యాప్‌ రెడీ..


లోక్‌సభ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటే తప్ప ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో బరిలోకి దిగేందుకు అకాశముండదు. అందుకే అన్ని పార్టీలు గ్రౌండ్‌లో యాక్టివ్ అయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. అతి పెద్ద రాష్ట్రమైన యూపీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఈ స్టేట్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించింది కాషాయ పార్టీ. యోగి ఆదిత్యనాథ్‌ పేరు మారుమోగుతోంది. అయినా...2019 ఎన్నికల్లో ఇక్కడ 14 సీట్లలో బీజేపీ ఓడిపోయింది. ఇది ఆ పార్టీకి మింగుడు పడలేదు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గట్టిగా నిలబడి గెలవాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే ఈ 14 పార్టీలపైనే ఫోకస్ పెట్టింది. లఖ్‌నవూ వేదికగా వ్యూహాలనూ సిద్ధం చేసుకుంది. బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్, యూపీ బీజేపీ ప్రెసిడెంట్ భూపేంద్ర చౌదరి ఈ స్ట్రాటెజీస్‌ని కీలక నేతలకు వివరించారు. బూత్‌ మేనేజ్‌మెంట్‌లో ఎక్కడా చిన్నలోపం కూడా తలెత్తొద్దని ఇప్పటికే కార్యకర్తలకు తేల్చి చెప్పారు సునీల్ బన్సాల్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. కొత్త ఓటర్ల సంఖ్యని తేల్చడంలోనూ కీలకంగా వ్యవహరించాలని హైకమాండ్ నుంచి ఆదేశాలందాయి. ఓ మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియమించనున్నారు. ఆ నియోజకవర్గంలో పార్టీ ప్రచార బాధ్యత అంతా ఆయనదే. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మండల స్థాయిలోనే పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశాలందాయి. 


యూపీపైనే ఫోకస్..


2019లో ఏ వర్గం ఓట్లు రాలేదో ఆ వర్గంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఓటర్లతో మాట్లాడనున్నారు బీజేపీ కార్యకర్తలు. ఈ మొత్తం ప్రాసెస్‌లో పైస్థాయి నేతలకు, కింది స్థాయి కార్యకర్తలకు సమన్వయం ఉండాలని హైకమాండ్ తేల్చి చెప్పింది. ఆయా నియోజకవర్గాల్లో వీలైనంత ఎక్కువ మందిని Pradhan Mantri Vishwakarma Yojana పథకంతో లింక్ చేసేలా చూసుకోనుంది బీజేపీ. తద్వారా ఓట్లు రాబట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.  Ayushman Bhava scheme గురించీ విస్తృతంగా ప్రచారం చేయనుంది బీజేపీ. ఇటీవల పార్లమెంట్‌లో పాస్ అయిన Nari Shakti Vandan Act పై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తోంది. తద్వారా మహిళా ఓటు బ్యాంకుపై గురి పెట్టింది. బూత్‌ స్థాయిలోనే పార్టీని బలోపేతం చేయడంతో పాటు లోకల్ లీడర్స్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపనుంది. యూపీలోని మొత్తం 80 ఎంపీ నియోజకవర్గాలనూ తన ఖాతాలో వేసుకోవాలని తీవ్రంగానే శ్రమిస్తోంది బీజేపీ. యోగి ఆదిత్యనాథ్ కూడా ఇక్కడ భారీ ఎత్తున ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎంపీ స్థానాలపై పట్టు సాధిస్తే మొత్తం రాష్ట్రంపై పట్టు సాధించేందుకు వీలవుతుంది. స్థానికంగా బలమూ పెరుగుతుంది. అందుకే ఇంతగా ముందు నుంచే శ్రమ పడుతోంది బీజేపీ


Also Read: కుమారస్వామికి బెస్టాఫ్ లక్ చెప్పిన డీకే శివకుమార్, ఎన్‌డీఏ కూటమిలో చేరడంపై వ్యాఖ్యలు