Manipur Violence:
ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ..
దాదాపు మూడు నెలల పాటు అల్లర్లతో అట్టుడికిపోయిన మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త కుదుట పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఆంక్షల్ని సడలిస్తోంది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ సర్వీస్‌లను పునరుద్ధరిస్తున్నట్టు ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ప్రకటించారు. మైతేయి, కుకీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరగడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. పోలీసులపైనా దాడులు జరిగాయి. విద్వేషాలు మరింత రెచ్చగొట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌తో పాటు బల్క్ SMS సేవల్నీ బంద్ చేసింది. ఇన్నాళ్లకు రీస్టోర్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. నిజానికి అంతా శాంతించినట్టే బయటకు కనిపిస్తున్నా ఇంకా చాలా చోట్ల పరిస్థితులు అదుపులోకి రాలేదు. మే 3వ తేదీన మొదలైన అల్లర్లు ఇంకా అక్కడక్కడా అలజడి రేపుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ 22న అర్ధరాత్రి భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఇంఫాల్‌లో ఘర్షణ జరిగింది. 5గురు వాలంటీర్లను అరెస్ట్ చేసినందుకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. ఇప్పటికే అరెస్ట్ అయ్యి విడుదలైన వాళ్లను మళ్లీ అరెస్ట్ చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. భద్రతా బలగాలు మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నాయి. అరెస్ట్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితం నమోదైన కేసుని ఇప్పుడు తవ్వి అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సుప్రీంకోర్టులో విచారణ..
అటు సుప్రీంకోర్టులోనూ ఈ అల్లర్లపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మణిపూర్ ప్రభుత్వం కోర్టుకి అన్ని వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ఈ అల్లర్లలో వినియోగించిన ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్రం, మణిపూర్ తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు కోర్టుకి అన్ని వివరాలు ఇచ్చారు. ఇక అక్కడ మహిళలపై జరిగిన దారుణాలపైనా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే CBIకి ఈ కేసులను బదిలీ చేశారు. 11 FIRలపై సీబీఐ విచారణ జరుపుతోంది. అయితే ఈ విచారణకు ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం కోర్టులో విన్నవించింది. మరికొంత సమయం ఇవ్వాలని కోరింది.
మణిపూర్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు మొదలు పెట్టింది. వీలైనంత త్వరగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఓ స్పెషల్ ఆర్మీ ఆఫీసర్‌ని రంగంలోకి దింపనుంది. 2015లో మయన్మార్‌లో సర్జికల్ స్ట్రైక్‌ని లీడ్ చేసిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని మణిపూర్ సమస్యను హ్యాండిల్ చేసేందుకు నియమించింది. దాదాపు రెండు నెలలుగా ఆ రాష్ట్రం తగలబడుతూనే ఉంది. ఇప్పటికే 170 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 24న మణిపూర్ ప్రభుత్వం రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెంబం (Nectar Sanjenbam)ని మణిపూర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సీనియర్ సూపరింటెండెంట్‌గా నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. స్పెషల్ ఫోర్సెస్‌ని లీడ్ చేసిన నెక్టార్...కీర్తి చక్ర అవార్డు గ్రహీత కూడా. ఆ తరవాత శౌర్య చక్ర అవార్డు కూడా పొందారు. మణిపూర్ హోం శాఖ నెక్టార్‌ని సీనియర్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.