Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వాహక నౌక నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఫొటోలను దీసింది. ఆగస్టు 15, 17 తేదీల్లో ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా విడుదల చేసిన చంద్రుని ఫొటోలను ఇస్రో ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. ల్యాండర్ మాడ్యూల్‌లో ఉన్న కెమెరాతో తీసిన ఈ చిత్రాల్లో ప్రొపల్షన్ మాడ్యూల్‌తో పాటు చంద్రునిపై వివిధ ప్రదేశాలను చూడవచ్చు. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(LPDC) ఈ ఫొటోలను తీసింది.
ఈ నెల 17న గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్ క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) సపరేషన్ జరిగింది. దీంతో చంద్రుడి చుట్టూ పరిభ్రమించడం పూర్తి అయిపోయింది. ప్రయోగం జరిగిన 35 రోజుల తర్వాత ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విజయవంతంగా వేరుపడింది. ఇకపై చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని బట్టి క్రమంగా చంద్రుని ఉపరితలానికి దగ్గరవుతుంది. ఆగస్టు 23వ తేదీన జాబిలిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అలా స్మూత్ ల్యాండ్ అయితే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినట్లే. అన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగితే చంద్రయాన్-3 విజయవంతం అవుతుంది.
భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గుర్తుగా ల్యాండర్‌కు విక్రం పేరు పెట్టారు. దీనిని చంద్రుడిపై (భూమిపై 14 రోజులు) ఒక రోజు పనిచేసేలా రూపొందించబడింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని, సాఫ్ట్ ల్యాండింగ్ చేసే వరకు దాని స్వంత పనులను నిర్వహిస్తుంది. విక్రమ్ ల్యాండర్‌లో రోవర్ ఉంటుంది. గతంలో మాదిరి చంద్రయాన్-3కి ఆర్బిటర్ ఉండదు. దానికి బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ కమ్యూనికేషన్ రిలే ఉపగ్రహంగా పనిచేస్తుంది. ఇది ల్యాండర్ సందేశాలను డీకోడ్ చేసి ఇస్రోకు పంపుతుంది.
మరోవైపు చంద్రయాన్-3 మిషన్‌లో మరో కీలక ప్రక్రియను ఇస్రో శుక్రవారం పూర్తి చేసింది. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన సంగతి తెలిసిందే. దాని డీబూస్టింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ 113 * 157 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఈ మేరకు శుక్రవారం డీ బూస్టింగ్ నిర్వహించారు. ఈనెల 20న ల్యాండర్-విక్రం, రోవర్ ప్రజ్ఞాన్‌తో కూడిన ల్యాండర్ మ్యాడుల్‌ను చంద్రుని ఉపరితలానికి అత్యంత సమీప కక్ష్యలోకి చేర్చేందుకు రెండో డీబూస్టింగ్ ఆపరేషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు.
చివరగా ల్యాండర్ వేగం తగ్గించి జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే ప్రక్రియ చేపట్టనున్నారు. చంద్రునిపై ల్యాండర్ దిగేటప్పుడు ఆరంభంలో వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లు ఉండనుంది. వేగం తగ్గించుకుంటూ.. ఈనెల 23 సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. అనంతరం ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial