Kota Suicides: 


స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్స్..


రాజస్థాన్‌లోని కోటా ట్రైనింగ్ సెంటర్స్‌కి హబ్‌ లాంటిది. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడి హాస్టల్స్‌, పీజీల్లో ఉంటూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా ప్రిపేర్ అయ్యే క్రమంలోనే కొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంజనీర్లు,డాక్టర్లు అవ్వాలన్న కలలతో వచ్చిన వాళ్లు చివరికి ఆత్మహత్యకు పాల్పడి అర్ధంతరంగా జీవితాన్ని ముగించేస్తున్నారు. ఫెయిల్ అవుతామేమో అన్న భయం కొందరిది. సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయానన్న బెంగ మరి కొందరిది. కారణమేదైనా ఈ మధ్య కాలంలో కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. గత 8 నెలల్లో 22 మంది ప్రాణాలు తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగారు. హాస్టల్స్‌లో చాలా మంది ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోతున్నారని గమనించారు. అందుకే...పాత ఫ్యాన్‌లు తీసేసి స్ప్రింగ్‌ లోడెడ్ ఫ్యాన్స్‌ని ఫిట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ ఫ్యాన్‌కి ఉరి వేసుకోవాలని చూసినా వెంటనే స్ప్రింగ్‌తో సహా కిందకు వస్తుందే తప్ప ఉరి బిగుసుకోదు. అందుకే...ఇక్కడి పీజీలు, హాస్టల్స్‌లో ఈ మెకానిజంతోనే ఫ్యాన్‌లు ఫిట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలిచ్చారు. మానసికంగా విద్యార్థులకు ధైర్యం చెప్పడం హాస్టల్స్ విధి అని, వారి భద్రతపైనా బాధ్యత ఉంటుందని తేల్చి చెప్పారు. ఒకవేళ ఈ ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తే...ఆయా హాస్టల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా ఓ టీమ్‌ని ఏర్పాటు చేసింది. వీళ్లే ఈ ఫ్యాన్‌లు ఫిట్ చేసే పనులను దగ్గరుండి సమీక్షించనున్నారు. 


2 లక్షల మంది 






అధికారిక లెక్కల ప్రకారం కోటాలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు హాస్టల్‌లు, పీజీల్లో ఉంటున్నారు. వీళ్లందరి ప్రాణాలకూ భరోసా ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. హాస్టల్ యాజమాన్యాలకు పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. సెల్ఫ్ హెల్ప్ ఆర్గనైజేషన్‌లు, కౌన్సిలర్‌లు, హెల్ప్‌లైన్ సంస్థలూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయి. నిజానికి కోటాలో అడుగుపెట్టినప్పటి నుంచే విద్యార్థుల లైఫ్‌స్టైల్ మారిపోతుంది. ఒకరితో ఒకరు పోల్చుకోవడం మొదలు పెడతారు. తాను వెనకబడిపోతున్నానేమో అనే అభద్రతా భావం పెరిగిపోతుంది. ఇక్కడికి వచ్చే వాళ్లలో చాలా మంది అప్పటికే అకాడమిక్స్‌లో మంచి పర్సంటేజ్‌లతో పాస్ అయి ఉంటారు. వాళ్లపై తల్లిదండ్రుల అంచనాలు పెరిగిపోతాయి. ఈ ఒత్తిడిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ప్రిపేర్ అవడం సవాలుగా మారిపోతుంది. ఇదే చివరకు బలవన్మరణానికి కారణమవుతోంది. ఈ ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ స్పందించారు. తనకూ డాక్టర్ అవ్వాలనే కల ఉండేదని, కానీ అది నెరవేరలేదని చెప్పారు. అలా అని అక్కడితోనే ఆగిపోలేదని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని అయ్యానని విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు పిల్లలకు తమ కెరీర్‌ని ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. 


Also Read: కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు, మళ్లీ సొంత గూటికే మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!