Karnataka Politics:
ఘర్ వాపస్..
కర్ణాటక రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా...ఏడాది తరవాత ఉన్నట్టుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యారు. ఫలితంగా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరవాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. అయితే...2019లో కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు చర్చలు జరుపుతోంది కాంగ్రెస్. లోక్‌సభ ఎన్నికలతో పాటు స్థానికంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశమే. దశలవారీగా వాళ్లను వెనక్కి రప్పించే పనిలో పడినట్టు సమాచారం. పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లకు సాదరంగా స్వాగతం పలకనుంది కాంగ్రెస్. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణమైంది. యశ్వంతపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్‌టీ సోమ శేఖర్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్‌తో చాలా సన్నిహితంగా ఉన్నారు. అంతే కాదు. శివకుమార్ తనకు గురువు లాంటి వారని వెల్లడించారు. కోఆపరేటివ్ సెక్టార్‌లో పురోగతి సాధించేందుకు డీకే శివ కుమార్ చాలా సహకారం అందించారని ప్రశంసించారు. ఈ సోమశేఖర్‌తో పాటు మరో 14 మంది ఎమ్మెల్యేలు 2019లో రాజీనామా చేశారు. ఈయనతో పాటు ఎమ్మెల్యేలు శివరాం హెబ్బర్, బ్యారతి బసవరాజు, కే గోపాలయ్య కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
త్వరలోనే చేరికలు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఈ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చలు జరిపారు. త్వరలోనే వీళ్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై ఆరోగ్యమంత్రి పరమేశ్వర్ స్పందించారు. బీజేపీ నుంచి ఎవరు వచ్చినా ఎలాంటి అభ్యంతరాలు ఉండవని తేల్చి చెప్పారు. వీళ్లతో పాటు మరి కొందరూ ఈ లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం. కాకపోతే...ఇదంతా ఇంకా చర్చల దశలోనే ఉంది. ఓ సారి సయోధ్య కుదిరితే వెంటనే వీళ్లు మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. ఆకర్ష్ ఆపరేషన్ చేపడుతోంది. అయితే...అందులో కొందరు మాత్రమే కాంగ్రెస్ ఆఫర్స్‌కి తలొగ్గుతున్నారు. కొంత మందికి ఆ ఆఫర్ నచ్చక వెనక్కి తగ్గుతున్నారు. మొత్తంగా చూస్తే...త్వరలోనే కర్ణాటక కాంగ్రెస్‌లో భారీ మార్పులే జరగనున్నట్టు సంకేతాలొస్తున్నాయి.
చాలా రోజుల తరవాత కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో మంచి జోష్ వచ్చినా...ఇక్కడ కూడా అదే ముసలం మొదలైందన్న ప్రచారం బాగానే జరుగుతోంది. పైగా దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపణలు చేసినట్టు వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు తమను అసలు పట్టించుకోడం లేదని ఎమ్మెల్యేలు హైకమాండ్‌కి కంప్లెయింట్ చేసినట్టూ తెలుస్తోంది. కీలక విషయం ఏంటంటే...11 మంది ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఓ లేఖ పంపినట్టు సమాచారం. వాళ్లందరూ ఆ లేఖపై సంతకాలు పెట్టి మరీ ఫిర్యాదు చేశారట. 20 మంది మంత్రులు తమని బాగా ఇబ్బంది పెడుతున్నట్టు అందులో కంప్లెయింట్ చేశారట. ఇక అప్పటి నుంచి కర్ణాటక కాంగ్రెస్‌లో కూడా ఏదో జరుగుతోందన్న వాదనలు మొదలయ్యాయి.
Also Read: థార్ ఎడారిలోనూ పంటలు పండుతాయ్, ఈ శతాబ్దం చివరి నాటికి అదే జరుగుతుందట!