Land-For-Jobs Case:
లాలూకి ఊరట..
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఊరట లభించింది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్న రబ్రీదేవి, బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్‌జేడీ ఎంపీ మీసా భారతికి కూడా బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. వీళ్లందరూ రూ.50 వేల బెయిల్ బాండ్ కట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 16న మరోసారి ఈ కేసుని విచారించనుంది కోర్టు. వీళ్లందరిపైనా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని CBIకి ఆదేశాలిచ్చింది.
ఇప్పటికే జులై 3వ తేదీన సీబీఐ ఛార్జ్‌షీట్‌ని కోర్టుకి సమర్పించింది. దీని ఆధారంగానే అక్టోబర్ 4వ తేదీలోపు కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లందరికీ ఢిల్లీ కోర్టు నోటీసులు పంపింది. ఈ నోటీసుల మేరకు అంతా కోర్టుకి హాజరయ్యారు. కోర్టుకి వెళ్లే ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో విచారణలు కొనసాగుతూనే ఉంటాయని, తాము ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు.