Asteroid: అంతరిక్షంలో లక్ష్యం లేకుండా సంచరిస్తున్న ఓ భారీ గ్రహ శకలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది ఒక స్థిర మార్గం, గమ్యం లేకుండా ప్రయాణిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి గ్రహశకలాలతో ప్రమాదం పొంచి ఉంటుందని చెబుతున్నారు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది కొన్నిసార్లు ఖగోళ వస్తువులు, ఇతర గ్రహాలలకు దగ్గరగా వస్తున్నట్లు గుర్తించారు. దీనికి 2023 ఎస్ఎన్6 అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. విమానం పరిమాణంలో ఉన్న ఈ భారీ గ్రహశకలం.. బుధవారం భూమికి చేరువగా వచ్చి వెళ్లనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా వివరించింది. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ భారీ గ్రహశకలం 48 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ గ్రహశకలం గంటకు 30,564 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ భారీ గ్రహశకలం భూమికి ఢీ కొట్టే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
గతనెలలో భూమిని చేరిన గ్రహశకలం నమానా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా... అంతరిక్ష నౌక బెన్నూ అనే గ్రహశకలం నుంచి కొన్ని నమూనాలు సేకరించింది. ఆ శాంపిల్స్ భూమిని చేరాయి. ఈ గ్రహశకలం నమూనాను పరిశీలిస్తే... 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించి మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని నాసా భావిస్తోంది.
గ్రహశకలం నమూనాలు తీసుకొచ్చేందుకు OSIRIS-REx అనే మిషన్‌ను సెప్టెంబర్ 8, 2016న ప్రారంభించింది నాసా. ఇది డిసెంబర్ 2018లో బెన్నూను చేరుకుంది. OSIRIS-REx రెండు సంవత్సరాల పాటు గ్రహశకలాన్ని మ్యాప్ చేసిన తర్వాత... 2020లో బెన్నూ నుండి రాళ్లు, ధూళిని సేకరించింది. మే 10, 2021న... OSIRIS-REx బెన్నూ పరిసరాల నుండి బయలుదేరింది. బెన్నూ అంతరిక్షంలో ఏడేళ్లు గడిపారు.
OSIRIS-REx మిషన్‌లో ప్రత్యేకత ఏమిటంటే అంతరిక్ష నౌక భూమిపైకి దిగదు. భూమికి సుమారు లక్ష కిలోమీటర్ల ఎత్తులో నుంచే నమూనా క్యాప్సూల్ విడుదల చేసింది. సరిగ్గా ఈ సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ఈ ప్రక్రియ జరిగింది. OSIRIS-REx మిషన్ విడుదల చేసిన గ్రహశకలం నమూనా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 25నిమిషాలకు ఉటా ఎడారిలో పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యింది. అంతరిక్ష నౌక నమూనాను విడుదల చేసిన 20 నిమిషాల తర్వాత ఇంజిన్లను మండించుకుని... అపోఫిస్ ఆస్టరాయిడ్ పయనమైంది. ఈ వ్యోమనౌక 2029లో ఆస్టరాయిడ్‌ను చేరుకుంటుంది.
బెన్నూని ముందుగా 1999 RQ36 అని పిలిచేవారు. OSIRIS-REx అంటే ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంటర్‌ప్రెటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ సెక్యూరిటీ- రెగోలిత్ ఎక్స్‌ప్లోరర్. OSIRIS-REx భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత... నమూనా రిటర్న్ క్యాప్సూల్‌ను విడుదల చేసింది. అవి ప్యారాచూట్ ద్వారా ఉటా ఎడారిలో ల్యాండింగ్ అయ్యాయి. వీటిని ముందుగా ఉటా ఎడారి పరిధిలోని తాత్కాలిక క్లీన్ ల్యాబ్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత... క్లోజ్‌చేసిన కంటైనర్‌లో ఉంచి హ్యూస్టన్‌కు తరలిస్తారు. గ్రహశకలం నమూనా బరువు 250 గ్రాములు ఉంటుందని అంచనా. క్యాప్సూల్‌లోని 75శాతం భాగాన్ని భవిష్యత్ పరిశోధన కోసం... హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో భద్రపరుస్తారు. మిగిలిన నమూనాను పరిశోధిస్తారు. వాటి ఫలితాలు 2025లోపు వచ్చే అవకాశం ఉంది. OSIRIS-REx మిషన్ను కూడా OSIRIS-APEXగా పేరు మార్చించింది నాసా.