Kerala Tour Packages : సమ్మర్ వెకేషన్స్ మొదలయ్యాయి. మీలో చాలామంది ఈ వేసవిలో ఎక్కడికెళదాం అని ప్లాన్ మొదలుపెట్టేసే ఉంటారు. సౌత్ ఇండియాలో టూర్ కి ప్లాన్ చేసేటపుడు కచ్చితంగా టాప్ 5 లో నిలిచే ప్రదేశం కేరళ. ఎక్కడ చూసినా గ్రీనరీతో నిండుగా, ప్రకృతి అందాలతో కళకళ్లాడే ఈ ప్రాంతాన్ని 'గాడ్స్ ఓన్ కంట్రీ' అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


కేరళ ప్రజల శిల్పకళా చాతుర్యం, పచ్చని హిల్ స్టేషన్లతో పాటూ..ఇక్కడ చూడటానికి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా కేరళ..అయుర్వేద వైద్యానికి, రెజువినేటింగ్ స్పా లకు ప్రసిద్ధి. అంతే కాకుండా, బ్యాక్ వాటర్, వన్యప్రాణులు, ఫారెస్ట్ ట్రెక్కింగ్ వంటివి అదనపు మెరుపు. 


కేరళ రాజధాని అయిన కొచ్చి, తప్పకుండా చూడవలసిన ప్రదేశం. వర్కాల, కోవలంలో అందమైన బీచ్ లు చూడాల్సిందే. కేరళ ప్రజల కళ, సాంస్కృతిక జీవనం తిరువనంతపురంలో కనపడుతుంది. కొల్లం, అలప్పీలు చూడకుండా తిరిగిరావటమైతే అసాధ్యం. క్రూయిజర్లు, కెట్టువల్లమ్స్ అని పిలిచే అందమైన చెక్క పడవలు బ్యాక్ వాటర్స్‌లో తిరుగుతాయి. ఇదొక గొప్ప అనుభూతి.


కేరళకు ఎలా చేరుకోవాలి?


ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సులభంగా చేరుకోవటానికి త్రివేండ్రం, కొచ్చిన్, కోయికోడ్, కన్నూర్ విమానాశ్రయాలు 4 కేరళలో ఉన్నాయి. త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పురాతనమైనది. ఇది సిటీ సెంటర్ నుండి కేవలం 3.7 కి.మీ దూరంలో ఉంది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కేరళలో చాలా రద్దీగా ఉంటుంది. ఇది పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడుస్తుంది. మీరు ఏ పెద్ద సిటీ నుంచి వచ్చినా, లేదా జైపూర్, పూణే , విశాఖపట్నం వంటి చిన్న నగరాల నుంచి వచ్చినా, ఈ విమానాశ్రయంలో దేశం నలుమూలలా వన్-స్టాప్ విమానాలు పుష్కలంగా ఉంటాయి. కరిపూర్ విమానాశ్రయం గతంలో కాలికట్ నగరంలో భాగం. ఇప్పుడు దీనిని కోయిక్కోడ్ అని పిలుస్తున్నారు. దీనికి రెండు టెర్మినల్స్ ఉన్నాయి. మీరు అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు చివరగా ఏ విమానాశ్రయానికి చేరుకున్నా, టాక్సీలు, పబ్లిక్ బస్సులు, అద్దెకు తీసుకునే ప్రైవేట్ వాహనాలు అన్నీ క్షణాల్లో అందుబాటులో ఉంటాయి. 


ట్రైన్ లో వెళ్ళొచ్చా?


కొల్లం, తిరువనంతపురం, అలప్పుజా, కోయికోడ్, కొట్టాయం, ఎర్నాకులం వంటి ప్రధాన స్టాప్‌లతో కేరళలో అద్భుతమైన కొంకణ్ రైలు మార్గం ఉంది. దాదాపు ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. 


మరి రోడ్ వే అయితే?


కేరళ ట్రిప్ కి లాంగ్ డ్రైవ్ చేయటం చాలా మంది ఎంచుకొనే మార్గం. ఎందుకంటే దారిపొడవునా కేరళ అందాలను చూస్తూ వెళ్లటానికి ఇది బెస్ట్ ప్లాన్. హైదరాబాద్ నుంచి 1,120 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి 2550 కిమీ, ముంబై నుంచి 1248 కిమీ, గోవా నుంచి 834, బెంగళూరు నుంచి 461 కి.మీ, చెన్నై నుంచి 603 కి.మీ. ఉంటుంది. కేరళకు రోడ్డు మార్గంలో ప్రభుత్వ, ప్రైవేట్ లగ్జరీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. 


హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునే వాళ్లు ఏం చేయాలి 
హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునే వాళ్లు 4 మర్గాల్లో వెళ్లొచ్చు. హైదరాబాద్‌ నుంచి నేరుగా ఫ్లైట్‌లో త్రివేండ్రం వెళ్లొచ్చు. దీనికి ఒకరికి ఐదు వేల నుంచి 15 వేల వరకు టికెట్ ధర ఉంటుంది. ఫ్లైట్‌లో అయితే మూడున్నర గంటల్లో కేరళ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్‌ ట్రైన్‌ జర్నీ. దీనికి 36 గంటల టైం పడుతుంది. సికింద్రాబా స్టేషన్ నుంచి ట్రైన్స్ ఉంటాయి. దీనికి ఒక్క టికెట్కు 300 నుంచి  3000 వరకు ఉంటుంది. మూడో ఆప్షన్ బస్‌. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాల నుంచి నేరుగా బస్‌లు వెళ్తుంటాయి. ఒకరికి 1500 నుంచి 3500 వరకు తీసుకుంటారు. నాల్గో ఆప్షన్ క్యాబ్. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని కూడా కేరళ వెళ్లొచ్చు. దీనికి 15000 వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. 


కేరళ టూరిజం శాఖ ఆఫర్‌
ఆన్‌లైన్‌లో చాలా కంపెనీలు మంచి ప్యాకేజీలు ఇస్తుంటాయి. ఒకసారి కేరళ టూర్ అని కొడితే చాలా కంపెనీలు వివరాలు అందిస్తాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేరళ ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. కేరళ టూరిజం శాఖ ఆఫర్లు కూడా ఇస్తోంది. 30 టు 35 శాతం రాయితీ ఇస్తోంది. ఈ శాఖ అందించే వివరాలు పరిశీలిస్తే ఒక ఫ్యామిలీ కేరళ 9 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది. మీ బడ్జెట్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు.