Lok Sabha Polls 2024: మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ (Lok Sabha Elections 2024) మొదలు కానుంది. ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలూ ఇందుకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘమూ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు ఇదంతా జరుగుతుంటే...మరోవైపు ఎన్నికల సంఘానికి ఓ లేఖ అందింది. లోక్‌సభ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ ఓ సంఘం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ మైతేయి కో ఆర్డినేటింగ్ కమిటీ (Delhi Meitei Coordinating Committee) ఈ రిక్వెస్ట్ పెట్టుకుంది. ఎన్నికల సంఘంతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కీ లేఖ రాసింది ఈ కమిటీ. మణిపూర్‌లో ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అక్కడ ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు (Manipur Violence) నిర్వహించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది మైతేయి కమిటీ. మణిపూర్‌లో రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఒకటి ఇన్నర్ మణిపూర్, మరోటి ఔటర్ మణిపూర్‌. ఏప్రిల్ 19వ తేదీన ఓ చోట, ఏప్రిల్ 26న మరో చోట ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరింది మైతేయి కమిటీ. ఏప్రిల్ 1వ తేదీన ఈ లేఖ రాసింది. ఈ పిటిషన్‌కి కొన్ని మీడియా రిపోర్ట్‌లు జత చేసింది. మణిపూర్‌లో శాంతి భద్రతలు ఇంకా అదుపులోకి రాలేదని ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన వివరాలనూ జోడించింది. 


ఏడాదిగా అలజడి..


గతేడాది మే 3వ తేదీన మణిపూర్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఈ అలజడి కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగానే అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని...మానసికంగా శారీరకంగా కుంగిపోయారని వివరించింది ఢిల్లీ మైతేయి కమిటీ. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఎన్నికల సంఘానికి చెందిన ప్యానెల్‌ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన రోజే ఈ పిటిషన్‌ బయటకు వచ్చింది. అయితే...అటు అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాలకు జరిగిన ఘర్షణల్లో 221 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 101 మంది మైతేయిలు కాగా, 114 మంది కుకీ వర్గానికి చెందిన వాళ్లు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. చాలా మంది యువత నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాల ధరలు మండి పోతున్నాయి. సాగు చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. సాగు చేసే క్రమంలో ఓ తెగపై మరో తెగ దాడి చేస్తోంది. రిజర్వేషన్‌ల విషయంలో చిన్నగా మొదలైన గొడవ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే వరకూ పెరిగింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడ్డట్టు కనిపిస్తున్నా అక్కడక్కడా దాడులు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మైతేయి, కుకీలు ఒకరిపై ఒకరు కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకునే మైతేయి కమిటీ ఎన్నికలో పోస్ట్‌పోన్ చేయాలని కోరుతోంది. 7 విడతల్లో జరగనున్న ఈ ప్రక్రియ జూన్ 1వ తేదీన ముగియనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. 


Also Read: Fact Check: ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్! ఈసీ కొత్త రూల్‌?