Fact Check: మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు మొదలు కానున్నాయి. మొత్తం 7 విడతల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఈసీ ఇప్పటికే ప్రకటించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నాయి. ఆ మేరకు అవగాహన కల్పిస్తున్నాయి. అయితే...ఈ మధ్య వాట్సాప్‌లో ఓ మెసేజ్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఓటు హక్కు వినియోగించుకోకపోతే బ్యాంక్ అకౌంట్‌ నుంచి రూ.350 డెబిట్ అవుతాయన్నది ఆ మెసేజ్‌లోని సారాంశం. ఓ పేపర్‌లో ఈ వార్త పబ్లిష్ అయినట్టు ఓ క్లిప్‌ పెట్టి అందరూ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇది నిజమేనా..? ఓటు హక్కు వేయకపోతే ఆధార్‌ కార్డ్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తారా..? దీనిపై ఆరా తీస్తే..ఇదంతా ఒట్టి పుకారే అని తేలింది. ఎన్నికల సంఘం ఈ కొత్త రూల్‌ తీసుకొచ్చిందన్న వార్తలో ఎలాంటి నిజం లేదని వెల్లడైంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే..బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తాన్ని కట్ చేస్తారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. కొంతమంది తెలిసీ తెలియక ఈ మెసేజ్‌ని అలాగే ఫార్వర్డ్ చేసేస్తున్నారు. 




నిజానికి ఇప్పుడే కాదు. గతంలోనూ ఎన్నికల సమయంలో ఇవే పుకార్లు పుట్టాయి. దీనిపై అప్పట్లో చాలా Fack Check సంస్థలు స్టడీ చేసి ఇదంతా ఫేక్ అని తేల్చి చెప్పాయి. అయినా ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఈ మెసేజ్‌ వాట్సాప్‌ గ్రూప్‌లలో కనిపిస్తూనే ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం అలాంటి నిబంధన ఏమీ పెట్టలేదని గతంలో ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. కొంత మంది సోషల్ మీడియా వేదికగానే ఈ విషయం వెల్లడించారు. అయితే...గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓ వార్తా సంస్థ ఇలానే వార్త వేసి ఆ తరవాత హోళీ ప్రాంక్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆ క్లిప్పింగ్స్‌ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.