Kerala Boat Tragedy: కేరళలో ఘోర విషాదం చోటుచేసుకుంది. టూరిస్టుల బోటు బోల్తా పడటంతో 15 మంది మృతి చెందినట్లు సమాచారం. మలప్పురం జిల్లాలో తన్నూర్ బీచ్ దగ్గర ప్రమాదం జరిగింది. టూరిస్టుల బోటు బోల్తా పడిన సమయంలో అందులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గజ ఈతగాళ్లతో పోలీసులు, సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే..
కేరళలోని మలప్పురం జిల్లాలో పర్యాటకులు ప్రయాణిస్తున్న ఓ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు మంత్రి వి అబ్దురహిమాన్ తెలిపారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. డబుల్ డెక్కర్ పడవలో మహిళలు, పిల్లలు సహా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద పురపుజా నదిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో బోటు బోల్తా పడటంతో విషాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ టీమ్స్ గజ ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
బోటు ప్రమాదం ఘటనలో ఇప్పటివరకూ దాదాపు 10 మందిని రెస్క్యూ టీమ్ రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టూరిస్టుల బోటు సర్వీసులు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నడపడానికి అనుమతి ఉంది. ప్రమాదం దాదాపు 7 గంటల సమయంలో జరగడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడువు దాటిన తరువాత బోటుకు పర్మిషన్ ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒడ్డు నుంచి 300 మీటర్ల దూరంలో బోటు బోల్తా పడటంతో నీళ్లలో పడిపోయి పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
బోటులోని ప్రయాణికులు మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి, తానూర్ ప్రాంతాలకు చెందిన వారని సమాచారం. అయితే బోటు డబుల్ డెకర్ బోటు కాగా, అందులో టూరిస్టులకు పరిపోయే సౌకర్యాలు గానీ, లైఫ్ జాకెట్ వంటి సదుపాయాలు లేవు అని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.