Diwali Bonus in Delhi:
దీపావళి బోనస్..
దీపావళి సందర్భంగా ఢిల్లీ ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. Group B నాన్ గెజిటెడ్, Group C ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ ఇస్తున్నట్టు తీపి కబురు చెప్పారు. ప్రెస్ బ్రీఫింగ్‌లో భాగంగా ఈ ప్రకటన చేశారు అరవింద్ కేజ్రీవాల్. దీపావళి బోనస్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.56 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. గ్రూప్B, గ్రూప్ C కి చెందిన మొత్తం 80 వేల మంది ఉద్యోగులకు ఈ బోనస్ అందనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల బాగోగులు చూసుకోవడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.
"దీపావళి సందర్భంగా గ్రూప్ బీ నాన్ గెజిటెడ్, గ్రూప్ సీ ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ ఇస్తాం. దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు ఈ బోనస్ అందుతుంది. అందుకోసం ప్రభుత్వం రూ.56 కోట్లు కేటాయించనుంది"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుందని, 8 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షల మేరకే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి కీలక పాత్ర పోషించారని వివరించారు. వాళ్ల శ్రమ వల్లే ఢిల్లీని ఇలా అభివృద్ధి చేయగలిగామని తెలిపారు. నవంబర్ 1వ తేదీన కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓ కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని కొందరు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 6,494 పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనని వెల్లడించారు.
"మున్సిపల్ కార్పొరేషన్ హౌజ్‌లో మీటింగ్ జరిగింది. 5 వేల మందిని రెగ్యులరైజ్ చేయాలని తీర్మానించాం. దాదాపు 15 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం వాళ్లను అసలు పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కార్మికులంతా చాలా సంతోషంగా ఉన్నారు. పంజాబ్‌లో మా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 30 వేల మంది ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. వీలైనంత వరకూ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకే ప్రయత్నిస్తున్నాం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
ప్రస్తుతం ఢిల్లీని కాలుష్యం కలవర పెడుతోంది. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఈ సమస్యపైనే దృష్టి పెట్టింది. దీపావళి పండుగ ముందు వాతావరణ పరిస్థితులు ఇలా మారడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కాలుష్య కట్టడికి చర్యలు మొదలు పెట్టింది.
Also Read: ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్, తెలంగాణ యువకుడితో సహా మరొకరు అరెస్ట్