Kashmir: పాకిస్థాన్ లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పర్యటించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా భారత్ లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి స్పందించారు. కశ్మీర్ అంశం.. భారత్, పాకిస్థాన్ రెండు దేశాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
డొనాల్డ్ బ్లోమ్ ఇటీవల 6 రోజుల పాటు పీవోకే లోని గిల్గిత్ బాల్టిస్థాన్ లో పర్యటించారు. గిల్గిత్ బాల్టిస్తాన్ లో అక్కడి ప్రజలను, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులను కలిసి మాట్లాడారు. ఈ విషయాన్ని పాక్ మీడియా ప్రత్యేక కథనాలుగా ప్రసారం చేశాయి. అయితే ఈ పర్యటన చాలా రహస్యంగా సాగిందని.. ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎవరెవరిని కలిశారు, ఏయే విషయాలపై చర్చించారు అని విషయాలు వెల్లడి కాలేదని పేర్కొన్నాయి. గిల్గిత్ బాల్టిస్థాన్ డిప్యూటీ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ఒక్కటే.. అమెరికా రాయబారి పీవోకేలో పర్యటించారు అనే దానికి అధికారి సమాచారంగా నిలిచింది. అయితే అమెరికా రాయబారి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించడంపై భారత్ లోని అమెరికా దౌత్యవేత్త గార్సెట్టి స్పందించారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
పాకిస్థాన్ లోని అమెరికా రాయబారికి సంబంధించి విషయాలపై తాను మాట్లాడకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే డొనాల్డ్ బ్లోమ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వెళ్లడం ఇదే తొలిసారి కాదని తేల్చి చెప్పారు. అలాగే జీ20 సదస్సులో భాగంగా తమ ప్రతినిధుల బృందం జమ్మూకశ్మీర్ లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందినది అని.. అమెరికా సహా ఏ ఇతర మూడో పక్షం ద్వారా కాకుండా దీనిని రెండు దేశాలు పరిష్కరించుకోవాల్సి ఉందని గార్సెట్టి వ్యాఖ్యానించారు.
గతేడాదీ పీవోకేలో పర్యటించిన అమెరికా రాయబారి
గత సంవత్సరం కూడా అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించారు. అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులను, నాయకులను కలిశారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాలను వాషింగ్టన్ కు తెలియజేశామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. కాగా, తన పీవోకే పర్యటన సందర్భంగా పాక్ ఆక్రమిత భారత భూభాగాన్ని ఆజాద్ జమ్మూ కశ్మీర్ అని డొనాల్డ్ బ్లోమ్ పదే పదే ప్రస్తావించారు కూడా.
'క్వైద్-ఎ-ఆజామ్ మెమోరియల్ డాక్ బంగ్లా పాకిస్థాన్ సాంస్కృతిక, చారిత్రక గొప్పతనానికి ప్రతీక, 1944లో జిన్నా ప్రముఖంగా సందర్శించారు. ఏజేకేకి నా తొలి పర్యటన సందర్భంగా సందర్శించడం నాకెంతో గౌరవంగా ఉంది' అని అప్పుడు అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.