Karnataka News: ఎమ్మెల్యే కుమార్తెను అనే గర్వంతో ఏకంగా పోలీసులపైనే ఫైర్ అయింది ఓ యువతి. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా అడ్డుకున్న పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించింది. కర్ణాటక భాజపా ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు.. రోడ్డుపై చేసిన హడావిడి ఇది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






ఇదీ జరిగింది


భాజపా ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు తన బీఎండబ్ల్యూ కారు డ్రైవ్‌ చేస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఓచోట రెడ్‌ సిగ్నల్‌ పడినా ఆగకుండా రయ్‌మంటూ దూసుకెళ్లింది. ఇది తెలిసిన ట్రాఫిక్‌ పోలీస్‌ ఆమె కారును ట్రేస్‌ చేసి రాజ్‌భవన్‌ రోడ్డు వద్ద ఆపారు. కారును పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే కుమార్తె 'నా కారే ఆపుతావా' అంటూ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది.


"నేనే ఎవరో తెలుసా.. నేను ఇప్పుడు వెళ్లాలి.​ నా కారును ఆపోద్దు. ఓవర్‌టేక్ చేసినందుకు నాపై కేసు పెట్టలేవు. ఇది ఎమ్మెల్యే వాహనం. మా నాన్న అరవింద్ లింబావలీ" అంటూ పోలీసులపై రెచ్చిపోయింది.


మీడియాపై 


పోలీసులపైనే కాకుండా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతోనూ ఆమె గొడవ పడింది. అయితే ఆమె సీట్‌ బెల్టుకూడా పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఎంత వాదించినా పోలీసులు మాత్రం యువతికి జరిమానా విధించారు.


అవాక్కయిన పోలీసులు


ఆ యువతి నడిపిన బీఎండబ్ల్యూ కారు నంబర్‌పై చలాన్లు పరిశీలించగా పోలీసులు ఖంగుతున్నారు. ఆమె వాహనంపై 9 వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక ప్రస్తుతం ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించినందుకు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించారు. దీంతో మొత్తం 10 వేలను ఆమె నుంచి పోలీసులు రాబట్టారు.


ఎమ్మెల్యే సారీ


ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే కుమార్తె చర్యలను ఎమ్మెల్యే లింబావలీ సమర్ధించుకున్నారు. కూతురు ఏ తప్పు చేయలేదని, ఇలాంటి ఘటనలు రోజూ వేలాదిగా జరుగుతాయన్నారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో ఎట్టకేలకు తన కూతురు తరపున భాజపా ఎమ్మెల్యే అరవింద్‌ క్షమాపణలు కోరారు.


Also Read: Indian American Sopen Shah: బైడెన్ నిర్ణయం- మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు


Also Read: Covid Update: దేశంలో భారీగా కరోనా కేసులు- కొత్తగా 7,584 మందికి వైరస్