Ramachandrappa : దేశంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక చోట మహిళలు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు తీర్చాల్సిన వాళ్లే కొన్ని చోట్ల సమస్యలను తెచ్చిపెడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా మితిమీరి ప్రవర్తిస్తున్నారు. న్యాయం జరుగుతుందేమోనని రోడ్డున పడుతున్న వాళ్లు కొందరైతే.. పరువు పోతుందని జరిగిన నష్టాన్ని, బాధను తమలోనే దాచుకుని కుమిలి పోతున్న జీవితాలెన్నో. తాజాగా కర్ణాటకలోనూ ఓ ఉదంతం చోటుచేసుకుంది. భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఓ మహిళపై అధికారంలో ఉన్న ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి, అరెస్ట్ చేశారు.
అసలేమైందంటే..
కర్ణాటకలోని మధుగిరి ((తుమకూరు జిల్లా)లోని ఓ మహిళ భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామచంద్రప్ప ఆ మహిళకు న్యాయం చేసేందుకు సాయం చేస్తారని మాయా మాటలు చెప్పి, నమ్మించి తన మగ బుద్దిని చాటుకున్నాడు. ఇదే అదనుగా చేసుకుని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనవరి 2న జరిగినట్టు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ తుమకూరులోని డీవైఎస్పీ రామచంద్రప్ప కార్యాలయాన్ని సందర్శించింది. నిందితుడు తనను ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా తాకాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పావగడకు చెందిన మహిళ ఆరోపించింది. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి కిటికీలోంచి కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై స్పందించిన ఓ సీనియర్ పోలీసు అధికారి.. ఈ సంఘటనను తీవ్రమైన అంశంగా పేర్కొంటున్నామని తెలిపారు. మహిళలపై వేధింపులు లేదా హింసను పోలీసు శాఖ సహించదని స్పష్టం చేశారు.
అధికారి సస్పెండ్, అరెస్ట్
భారత న్యాయ సంహిత సెక్షన్లు 68(అధికారంలో ఉండి లైంగిక వేధింపులు), 75 (లైంగిక వేధింపులు), 78 (వెంబడించడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. డీవైఎస్పీ రామచంద్రప్పని అరెస్టు చేశామన్నారు. సర్వీస్ నుంచి సస్పెండ్ చేశామని కూడా వివరించారు. ఈ కేసును అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇక కర్నాటక హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Crime News: 50 ఏళ్ల భర్త , 30 ఏళ్ల భార్య - ఒక రోజు పొలంలో ముక్కలుగా భర్త శరీరం - ఈ స్టోరీ చాలా వయోలెంట్