Dense Fog Covers Delhi : ఉత్తర భారతదేశాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోవడంతో మంచు గట్టిగా కురుస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. టెంపరేచర్స్ భారీగా తగ్గడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చాలా ప్రదేశాలను దట్టమైన పొగమంచు ఆవరించింది. వాతావరణం మరింత క్లిష్టంగా మారడంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
ఇండిగో ఎయిర్ లైన్స్ తాత్కాలికంగా తన రాకపోకలను నిలిపివేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, ఉదయం 12.05 గంటలకు విమానాశ్రయం X పోస్ట్‌లో తెలిపింది. ప్రయాణికులు అప్‌డేట్ చేసిన విమాన సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్‌ని సంప్రదించాలని చెప్పింది. ఇక దృశ్యమానత తగ్గిన కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరే విమానాలు హోల్డ్ లో పెట్టామని ఇండిగో వెల్లడించింది. ఎయిర్‌సైడ్ రద్దీ కారణంగా విమానాలు ఆలస్యం అవుతాయని ఎయిర్‌లైన్ తెలిపింది. ఫలితంగా దాదాపు 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
దట్టమైన పొగమంచు - పలు రైళ్లు రద్దు
అంతటా ఆవరించిన పొగమంచు కారణంగా రైల్వే కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే దాదాపు 50కు పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు సమాచారం.
Also Read : Insta Love Affair: యువకుడితో ఇన్‌స్టాలో యువతి లవ్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ - ట్విస్ట్ ఏంటంటే
ఐఎండీ హెచ్చరిక
కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా కోల్‌కతా, చండీగఢ్, అమృత్‌సర్, జైపూర్ వంటి ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని వైశాలి ప్రాంతం కూడా దట్టమైన పొగమంచుతో కనిపించింది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఏకాంత ప్రదేశాలలో తీవ్రమైన మంచు కురిసే పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఢిల్లీలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 13°C - 16°C, 6°C - 8°C మధ్య ఉండే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో పాలెం ప్రాంత పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు నెమ్మదిగా వాహనాలు నడుపుతూ కనిపించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో గాలి వేగం 4-6 kmph వరకు పెరిగే అవకాశం ఉందని, సాయంత్రం, రాత్రి సమయంలో నైరుతి దిశ నుండి 4 kmph కంటే తక్కువకు తగ్గుతుందని అంచనాలు సూచిస్తున్నాయి. ఇక పాలెం ఎయిర్ పోర్ట్ వద్ద ఈ రోజు 8 గంటలకు విజిబిలిటీ లెవల్ 0 మీటర్లుగా నమోదైంది. ఇక ఢిల్లీకి రావల్సిన విమానాలు దాదాపుగా 6నిమిషాలు, అక్కడ్నుంచే బయల్దేరే ఫ్లైట్స్ సుమారు 47నిమిషాలు ఆలస్యంగా నడిచాయని, దీంతో తాము ఇబ్బందులు పడ్డామని పలువురు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.