Makar Sankranti 2025: సరదాల సంక్రాంతి మరో కొన్ని రోజుల్లో రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వాకిట్లో రంగు రంగుల ముగ్గులు, వంటింట్లో గుమగమ లాడే పిండి వంటలు ఈ వైభవాన్ని మరింత ఆకర్షిణీయంగా చేస్తాయి. ఈ పండుగ వస్తుందంటే చాలా వయసుతో తేడా లేకుండా చాలా మంది ఆకాశంలో గాలిపటాలను ఎగరేస్తూ ఉంటారు. అయితే ఇంతకీ పతంగులను ఈ పండుగకే ఎందుకు ఎగురవేస్తారు.. దీని వెనక ఉన్న హిస్టరీ, స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పట్టు తప్పితే పారిపోతుంది..
ఆకాశంలో తేలుతుంది మేఘం కాదు. తోకాడిస్తుంది పిట్టకాదు. పట్టు తప్పితే పారిపోతుంది.. అన్న సామెత మన చిన్నతనంలో వినే ఉంటాం. ఇంతకీ అదేంటో చెబుతారా? అంటే ఠక్కున గుర్తొచ్చే సమాధానం గాలిపటం. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఆకాశంలో పతంగులు కనువిందు చేస్తూంటాయి. కానీ వీటిని ఎగురవేయడం అందరికీ సాధ్యం కాదు. నేర్పు, నైపుణ్యం ఉంటే తప్ప పతంగులను నింగిలోకి పంపలేం. గాలి వేగం, గాలిపటాన్ని తయారు చేసే పదార్థం, హ్యాండర్ల నైపుణ్యంపై ఆధారపడి పతంగి పైకి ఎగురుతుంది.
సాధారణంగా మకర సంక్రాంతి పండుగ చలికాలంలో వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి రోజు సూర్య భగవానుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను సూర్యభగవానుడికి అంకితం చేస్తారు. ఈ పండుగతో చలికాలం పూర్తై వసంత కాలంలోకి స్వాగతం పలకడం కోసం అనాదిగా ఆకాశంలో గాలిపటాలను ఎగురవేంటారు. ఈ రోజు మన దేశంలో వసంత రుతువు ఆగమనాన్ని, శీతాకాలం ముగింపును సూచిస్తుందని నమ్ముతారు. ఈ రోజు నుంచి పగలు సమయం పెరగడం, రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది. అంతేకాదు పతంగులను ఆకాశంలో ఎగురవేసేందుకు మరో కారణం కూడా ఉంది. 6 నెలల తర్వాత సకల దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని వారికి ఆహ్వానం పలికేందుకు గాలి పటాలు ఎగరవేస్తారని విశ్వసిస్తుంటారు.
వినోదానికి మాత్రమే కాదు..
పతంగులను కేవలం వినోదానికి మాత్రమే ఎగురవేస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఆరోగ్యపరంగానూ దీనికి ప్రయోజనాలున్నాయి. గాలిపటాలను ఎగరేసేటపుడు మన శరీరంపై సూర్యకిరణాలు పడతాయి. దీని వల్ల విటమిన్ డి (Vitamin D) లభించి శరీరంలోని చెడు బాక్టీరియా తొలిగిపోయి చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఎండలో ఉండడం వల్ల మనసుకు వెచ్చని ఆహ్లాదం కలుగుతుంది. గాలిపటం దారాన్ని పట్టుకొని పరుగెత్తడం వల్ల కేలరీలు కరుగుతాయి. హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం,
త్రేతాయుగంలో శ్రీరాముడు తన సోదరులు, హనుమంతునితో కలిసి మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేశాడని చెప్తారు. అప్పట్నుంచి ఈ పండుగకి గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోందని నమ్ముతారు.
గాలిపటాలకూ హిస్టరీ ఉండందోయ్
పతంగులను ఎగరేయడం అనేది ఇప్పటిది కాదు. క్రీస్తు పూర్వం 2వేల ఏళ్ల కిందే చైనాలో మొదలైందట. ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త మోజీ మొదట ఈ గాలిపటాన్ని పట్టువస్త్రంతో తయారు చేశారట. ఆ తర్వాత హేన్ చక్రవర్తి శత్రువు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనే ఆలోచనతో పతంగి తయారుచేసి దానికి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారాన్ని కొలిచి సొరంగం తవ్వి, సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడని కొందరు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. కాలక్రమంలో విదేశాల్లోనూ గాలి పటాలు ఎగరేయడం మొదలుపెట్టారు. అలా మన దేశంలోనూ ఈ ఆచారం ప్రారంభించారు. ముందు సన్నని వస్త్రంతో, ఆ తర్వాత కాగితంతో గాలిపటాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నిజాం నవాబులు కూడా గాలిపటాలు ఎగరవేయడాన్ని బాగా ప్రోత్సహించారు. పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడంతో ఇప్పుడవి మన సంస్కృతిలో భాగంగా మారాయి.
దేశంలోని అన్ని ప్రాంతాలలో సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ పండుగను వేడుకగా జరుపుకుంటారు. మకర సంక్రాంతికి చాలా కాలం ముందు, ప్రజలు తమ ఇళ్లలో గాలిపటాలు తయారు చేయడం లేదా వాటిని కొనడానికి బయటకు వెళ్లడం చేసేవారు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అన్నీ తమ తమ ప్రాంతాల్లోనే దొరుకుతున్నాయి. ఇక ఈ పండుగను పురస్కరించుకుని ఈ రోజున గుజరాత్ లోని సబర్మతీ నదీ తీరంలో, హైదరాబాద్ - సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏటా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ వేడుకకు లక్షల మంది హాజరవుతారు.