Karnataka Budget:


కర్ణాటకలో బడ్జెట్..


కర్ణాటకలో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో వింత సీన్ కనిపించింది. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ వెరైటీగా నిరసన వ్యక్తం చేసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ నేతలందరూ చెవిలో పువ్వు పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులే సరిగా ఖర్చు చేయలేదని, 2018లో ఇచ్చిన హామీలనూ పక్కన పెట్టేశారని బీజేపీపై మండి పడుతోంది కాంగ్రెస్. ఈ ఏడాది మే నెలలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ బడ్జెట్‌తో ఆ విజయానికి బాటలు వేసుకోవాలని చూస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ #KiviMeleHoova హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతోంది. దీనర్థం "చెవిలో పువ్వు"అని. బీజేపీ హామీల పేరుతో అందరినీ ఫూల్స్ చేస్తోందని కాంగ్రెస్ ఇలా సింబాలిక్‌గా సెటైర్లు వేసింది. ఈ సందర్భంగా సిద్దరామయ్య  బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఇప్పటి వరకూ 600 హామీలు ఇచ్చిందని, వాటిలో కనీసం 10% కూడా నెరవేర్చలేదని తేల్చి చెప్పారు. అటు సీఎం బసవరాజు  బొమ్మై మాత్రం ఇది ప్రజల బడ్జెట్ అంటూ ప్రకటించారు. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. వెనకబడిన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను తయారు చేసింది. 






రామ మందిర నిర్మాణం..


బడ్జెట్‌లో భాగంగా సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. త్వరలోనే రామ మందిరం నిర్మిస్తామని వెల్లడించారు. రామనగర వద్ద రామాలయం కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు రైతులకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఇండియన్‌ ఆర్మీలో చేరాలనుకునే SC, ST, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. మహిళా కార్మికులకు శ్రమ శక్తి పథకంలో భాగంగా నెలకు రూ.500 నగదు అందిస్తామని ప్రకటించారు. అయితే...కాంగ్రెస్ మాత్రం బీజేపీవి అబద్ధపు హామీలు అంటూ మండి పడుతోంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వీలైనంత వరకూ ప్రయత్నిస్తోంది. బీజేపీపై కాస్తో కూస్తో వ్యతిరేకత ఉండటం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశముంది. అధికారం మళ్లీ బీజేపీ చేతుల్లోకి వెళ్లకుండా ప్రత్యేకంగా దృష్టి సారించింది.