తన పెన్ పోయిందని తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంత చిన్న పెన్ను ఖరీదు ఏకంగా రూ.1.5 లక్షలకు పైమాటే. అంతేకాక, ఆ పెన్ను చనిపోయిన తన తండ్రి గుర్తు అని తమిళనాడు కాంగ్రెస్ ​కు చెందిన కన్యాకుమారి ఎంపీ విజయ్​ వసంత్ తెలిపారు. ఈ మేరకు కేసు పెట్టారు. చెన్నైలో జరిగిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత సమావేశంలో తన పెన్ను చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. ఈ పెన్నును తన తండ్రి తనకు ఇచ్చారని, అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని గుర్తు చేసుకున్నారు. అలాంటి పెన్ను పోవడం తనను ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


‘‘మా నాన్నగారు గుర్తుగా ఉంచుకున్న 1.50 లక్షల రూపాయల పెన్ను మాయమైపోయింది’’ అని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. కిరాణా దుకాణం నుంచి లోక్‌సభ సభ్యుడి వరకు అలుపెరగని కృషితో వసంతకుమార్ అన్నాచ్చి ఎదిగారు. ఆయన కుమారుడే విజయ్ వసంత్. తండ్రి చనిపోయాక కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన తండ్రిని స్మరించుకుంటూ ఆ పెన్నుని సెంటిమెంట్‌గా ఉపయోగిస్తున్నారు. నాన్న (వసంతకుమార్) తన దగ్గర లేకపోయినా, అతను ఉపయోగించిన పెన్ను తన జేబులో ఉంచుకున్నప్పుడల్లా, తండ్రి తనతో ఉన్నాడని తనకు ఎప్పుడూ అనిపిస్తుండేదని అన్నారు.


Also Read: MLA Salary: పాపం, ఆ ఎమ్మెల్యేలకు అంత తక్కువ జీతాలా? తెలంగాణలో మాత్రం హైయెస్ట్ సాలరీలు!


చెన్నై గిండీలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ విజయ్ వసంత్ హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో ఎప్పుడూ చొక్కా జేబులో పెట్టుకునే పెన్ మాయమైందని తెలిసింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన విజయ్ వసంత్ తన పార్టీ వాలంటీర్ల ద్వారా పెన్ను కోసం వెతికినా అది కనిపించలేదు. దీంతో గిండిలోని పోలీస్ స్టేషన్‌లో తన పెన్ను పోవడంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా ప్రస్తుతం సదరు స్టార్ హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


పెన్ను పోవడంపై విజయ్ వసంత్ ఆవేదన చెందగా, ఆయన్ను సన్నిహితులు ఓదారుస్తున్నారు. ఇప్పుడు ఎంపీ విజయ్ వసంత్ కలం పోయిందన్న వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.


Also Read: YSRCP MP Phone Theft: వైసీపీ ఎంపీ సెల్ ఫోన్ చోరీ! ఓ యువతికి కష్టాలు, చివరికి ఏమైందంటే