ఎమ్మెల్యేల జీతాలు పెంచాలి: దిల్లీ అసెంబ్లీ


ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ దిల్లీ అసెంబ్లీ బిల్స్‌ పాస్ చేసింది. 2011 నుంచి ఎమ్మెల్యేల జీతాలు పెంచలేదు. అందుకే ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల జీతాలూ పెంచనున్నారు. అన్ని అలవెన్స్‌లు కలుపుకుని ఒక్కో ఎమ్మెల్యేకి నెలకు రూ.90,000 జీతం ఇవ్వాలన్న ప్రతిపాదనలున్నాయి. 2011లో ఇది రూ.54,000 కాగా ఇప్పుడు దాదాపు 66% మేర పెంచాలని చూస్తున్నారు. బేస్‌ సాలరీ రూ.12,000 నుంచి రూ.30,000 వరకూ పెరగనుంది. కాన్‌స్టిట్యుయెన్సీ అలవెన్స్‌లు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెరగనుంది. టెలిఫోన్ బిల్ ఛార్జ్‌లు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు పెంచనున్నారు. ఇక సెక్రటేరియట్ అలవెన్స్‌లనూ పెంచాలని చూస్తున్నారు. రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకూ పెంచుతారని తెలుస్తోంది.


తెలంగాణ ఎమ్మెల్యేలకే ఎక్కువ జీతాలు..!


నిజానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే దిల్లీలోని ఎమ్మెల్యేల జీతాలే తక్కువ. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ ప్రకారం..తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే జీతం రూ.20,000. కానీ కాన్‌స్టిట్యుయెన్సీ అలవెన్స్‌ మాత్రం రూ.2.3లక్షలు. అంటే మొత్తం కలుపుకుని రూ.2.5లక్షలు అన్నమాట. దేశంలోని మిగతా ఎమ్మెల్యేలతో పోల్చి చూస్తే...తెలంగాణ ఎమ్మెల్యేలు...అత్యధిక జీతాలు అందుకుంటున్నారు. కర్ణాటక ఆ తరవాతి స్థానంలో ఉన్నట్టు సమాచారం. కర్ణాటకలో ఒక్కో ఎమ్మెల్యే నెలవారీ జీతం రూ. 2.05లక్షలు. తరవాత ఉత్తరప్రదేశ్‌లో రూ. 1.87 లక్షలు, బిహార్‌లో రూ.1.65లక్షలు, జమ్ము కశ్మీర్‌లో రూ.1.60లక్షలు, మహారాష్ట్రలో రూ.1.60లక్షలుగా ఉన్నాయి ఎమ్మెల్యేల జీతాలు. ఎమ్మెల్యేలకు ఆయా రాష్ట్రాలు అందించే జీతాలకు, అలవెన్స్‌లకు చాలా తేడా ఉంటోందని చెబుతోంది పీఆర్‌ఎస్ లిజిస్లేటివ్ సంస్థ. 


ఈసారైనా కేంద్రం ఆమోదిస్తుందా..?


హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎమ్మెల్యేల నెల జీతం రూ.55,000కాగా, అలవెన్స్‌లు మాత్రం రూ.1.3లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో జీతం రూ.12,000కాగా కాన్‌స్టిట్యుయెన్సీ అలవెన్స్‌లు రూ. 1.13లక్షలుగా ఉంది. దేశంలో అత్యంత తక్కువ బేస్ సాలరీ తీసుకుంటున్నారు కేరళ ఎమ్మెల్యేలు. వీళ్ల బేస్‌ సాలరీ రూ.2000 మాత్రమే. సెక్రటేరియల్ అలెవెన్స్‌లూ ఉండవు. మిగతా అలవెన్స్‌లు కలుపుకుని రూ.43,750 అందిస్తారు. తరవాత త్రిపుర, రాజస్థాన్, సిక్కిం, మిజోరంలోనూ ఎమ్మెల్యేల నెల జీతాలు తక్కువగానే ఉన్నాయి. నిజానికి దిల్లీ ప్రభుత్వం 2015లోనే ఎమ్మెల్యేల జీతాలు పెంచాలని ప్రతిపాదించింది. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలపలేదు. ఈసారైనా అప్రూవ్ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. దాదాపు పదేళ్లుగా జీతాల్లో పెంపు లేదన్న వాదన వినిపిస్తోంది దిల్లీ సర్కార్. ఈసారి ఎలాగైనా ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలని భావిస్తోంది. అనుకున్నట్టుగానే ఈ పెంపు అమల్లోకి వస్తే ఆ మేరకు దిల్లీ అసెంబ్లీలోనిఎమ్మెల్యేలందరూ లబ్ధి పొందినట్టే. 


Also Read: Hyderabad As Bhagyanagar: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?