హైదరాబాద్ పేరు మార్చాల్సిందేనంటున్న భాజపా..


హైదరాబాద్ మాత్రమే కాదు. హైదరాబాద్ పేరు కూడా రాజకీయాలకు కేంద్రంగా మారిపోయింది. భాజపా, తెరాస మధ్య ఈ అంశంపైనా చాలా రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పేరుని "భాగ్యనగర్‌"గా మార్చాలంటూ కాషాయ పార్టీ ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉంది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా పేరు మార్చుతామని హామీ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే మరో కొత్త వాదన కూడా వినిపిస్తోంది. "హైదరాబాద్‌ అసలు పేరు భాగ్యనగర్" అని భాజపా గట్టిగా చెబుతోంది. ప్రతిపక్షాలు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నాయి. నగరాలకున్న ముస్లిం పేర్లను తీసేసి హిందూ పేర్లు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలహాబాద్ పేరు ప్రయాగ్‌రాజ్‌గా మారింది అలానే. ఇప్పుడు హైదరాబాద్‌పై దృష్టి పడింది. 


పేరు ఇలా మారిందా..? 


హైదరాబాద్‌ను గతంలో అందరూ భాగ్యనగర్‌గానే పిలిచేవారన్న వాదనలకు కొందరు ఆధారాలనూ చూపిస్తున్నారు. మరికొందరు వాటిని కొట్టిపారేస్తున్నారు. కులీ కుతుబ్‌షా, భాగమతి లవ్‌స్టోరీ గురించి తెలియని వారుండరు. గుర్రపు స్వారీకి వెళ్లినప్పుడు భాగమతిని చూసి ప్రేమలో పడిపోయాడు కుతుబ్‌షా. తండ్రి మరణానంతరం భాగమతిని పెళ్లాడాడు. తన భార్య ప్రేమకు గుర్తుగా ఓ సిటీని నిర్మించాడు. ఆ నగరానికి "భాగ్‌నగర్" అని పేరు పెట్టాడని చెబుతారు. అయితే ఈ పేరు మార్పుపై కొందరు మరో వాదన కూడా వినిపిస్తున్నారు. కుతుబ్‌షాను పెళ్లి చేసుకున్న తరవాత భాగమతి ఇస్లాంలోకి మారిపోయిందని, హైదర్ బేగమ్‌గా పేరు మార్చుకుందని అంటారు. అందుకే ఆమె పేరిట కట్టించిన నగరానికి హైదరాబాద్‌ అని పేరు పెట్టారని చెబుతారు. కానీ..చరిత్రకారులు మాత్రం ఇదంతా కట్టుకథ కొట్టిపారేస్తుంటారు. 


ఆ గార్డెన్స్‌ వల్లే భాగ్యనగర్ అనే పేరు..? 


ఇదే వివాదంపై మరో థియరీ కూడా ఉంది. గోల్కొండ ప్రాంతంలో నివసించే ధనికులు, అక్కడి వాతావరణ నచ్చక మూసీ నది తీరాన కొత్త నగరాన్ని కట్టుకున్నారని, అదే హైదరాబాద్‌ అని అంటారు. విశాలమైన భవంతులు,గార్డెన్స్ ఇక్కడ నిర్మించుకున్నారట. గార్డెన్స్‌  ఎక్కువగా ఉండటం వల్ల "బాగ్‌నగర్‌గా"-సిటీ ఆఫ్‌ గార్డెన్స్‌గా (బాగ్‌ అంటే గార్డెన్‌ అని అర్థం) పిలుచుకునేవారట. ఎప్పుడైతే కులీ కుతుబ్‌షా భాగమతి పేరిట కొత్త సిటీ నిర్మించాలనుకున్నాడో, అప్పుడే ఈ బాగ్‌నగర్‌ను ఎంపిక చేసుకున్నాడట. పేరుని మాత్రం "హైదరాబాద్‌"గా మార్చారని కొందరు వాదిస్తుంటారు. 


భాగ్యలక్ష్మి అమ్మవారి పేరు పెట్టుకున్నారా..?


ఇక ఈ పేరు మార్పుపై మరో కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్‌ను భారత్‌ నుంచి విడగొట్టి ప్రత్యేక ముస్లిం రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అప్పటి నైజాం ప్రయత్నించారు. అయితే దీనిపై హిందువుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. తమ ఉనికిని చాటుకునేందుకు హిందువులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పుడే వాళ్లు భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుని తమ నగరానికి పెట్టుకోవాలని భావించారు. హైదరాబాద్‌ పేరుని కాదని "భాగ్యనగర్‌"గా పిలుచుకోవటం మొదలు పెట్టారట. ఇదిగో హైదరాబాద్‌ పేరు గురించి ఇన్ని థియరీలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు భాజపా వీటినే ఆధారంగా చేసుకుని "భాగ్యనగర్‌"గా పేరు మార్చాలన్న పట్టుదలతో ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. అహ్మదాబాద్ పేరుని అదానీబాద్‌గా ఎందుకు మార్చరు అంటూ కేటీఆర్‌ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. మొత్తానికి హైదరాబాద్ పేరుపై ప్రస్తుతానికి పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది.