రాజమహేంద్రవరంలో మంత్రి రోజా పర్యటన సందర్భంగా అక్కడి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఫోను దొంగతానికి గురైంది. అంతకుముందే ఎంపీ భరత్ మంత్రి రోజా పర్యటనలో పాల్గొన్నారు. ఆ సందర్భంగానే గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీ ఫోన్ ను కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఫోన్ కనిపించడంలేదని ఎంపీ రాజమహేంద్రవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేయగా, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులోని ఓ దుకాణంలో పని చేసే యువతితో ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఆ తర్వాతే ఆ ఫోన్ కనిపించలేదని ఎంపీ చెప్పారు. ఎంపీకి చెందిన వ్యక్తిగత సమాచారం సహా, రాజకీయ వ్యవహారాల సమాచారం అందులో ఉండడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఎంపీ ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేసిన పోలీసులు చివరగా ఫోన్ సిగ్నల్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అది ఒకరి ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించారు. అక్కడి పోలీసులు వెళ్లి విచారణ చేయగా, ఇంట్లో ఓ యువతి ఉన్నారు. ఆ ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఎంపీ సెల్‌ఫోన్ చోరీ అయితే, తన ఇంట్లో ఎందుకు వెతుకుతున్నారంటూ యువతి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆ యువతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో యువతి తిరిగివచ్చేసినట్లు తెలుస్తోంది.
తన ఇంట్లో బట్టల్ని, సామాన్లను కింద పడేశారని యువతి ఆరోపించారు. తనకు అవమానం జరిగిందని, ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు, మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానని యువతి చెప్పారు. అయితే, పోలీసులు ఈ అంశంపై స్పందిస్తూ సెల్‌ఫోన్ కనిపించడం లేదని ఎంపీ ఫిర్యాదు చేయడంతో సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ఆధారంగానే యువతి ఇంటికి వెళ్లామని తెలిపారు. ఆమె ఇంట్లో ఉన్న మహిళలతోనే సోదాలు చేయించినట్లు చెప్పారు. తాము అసలు దురుసుగా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు.
పెన్ను పోయిందని మరో ఎంపీ ఫిర్యాదు
తన పెన్ పోయిందని తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంత చిన్న పెన్ను ఖరీదు ఏకంగా రూ.1.5 లక్షలకు పైమాటే. అంతేకాక, ఆ పెన్ను చనిపోయిన తన తండ్రి గుర్తు అని తమిళనాడు కాంగ్రెస్ కు చెందిన కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ తెలిపారు. ఈ మేరకు కేసు పెట్టారు. చెన్నైలో జరిగిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్వాగత సమావేశంలో తన పెన్ను చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. ఈ పెన్నును తన తండ్రి తనకు ఇచ్చారని, అది తనకు ఎంతో ప్రత్యేకమైనదని గుర్తు చేసుకున్నారు. అలాంటి పెన్ను పోవడం తనను ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.