Rajasthan Polls: దేశంలో తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఒటు హక్కు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉద్యోగాలు చేసే వారు సైతం తమ ఓటు హక్కు ఉపయోగించుకునేలా సదుపాయాలు కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తోంది. తొలుత రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మీడియా సిబ్బందితో పాటు ఎనిమిది శాఖల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.
నవంబర్ 25న జరిగే పోలింగ్‌కు జర్నలిస్టులతో పాటు విద్యుత్తు, రవాణా, ఆరోగ్యశాఖలు సహా మొత్తం 8 శాఖల్లో ఉద్యోగులకు పోస్టల్‌బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్టు రాజస్థాన్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ వర్కర్లు, ఇంధన శాఖలో ఎలక్ట్రీషియన్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో లైన్‌మెన్లు, పంప్ ఆపరేటర్లు, రాజస్థాన్ మిల్క్ కమిటీల్లో టర్నర్లు, రవాణా కార్పొరేషన్‌లో ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, అగ్నిమాపక సిబ్బందితో పాటు మీడియా సిబ్బందికి ఈ ఏడాది నుంచి పోస్టల్‌బ్యాలెట్ అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు.
జర్నలిస్ట్‌లకు తొలిసారి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం
వివిధ మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు తొలిసారి సర్వీసు ఓటర్ల కేటగిరీలో చేర్చినట్లు ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు ఈ సదుపాయం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులకు, ఆర్మీ, పారా మిలటరీ సిబ్బందికి మాత్రమే ఉందని వివరించారు. ఇకపై అత్యవసర సర్వీసుల్లో పనిచేసే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే పోలింగ్ రోజున విధుల్లో ఉండే ఉద్యోగుల గురించి, ఆ రోజు ఓటు వేయడం సాధ్యం కాని వారి వివరాలను సంబంధిత విభాగాలు తమకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. ఆ జాబితాల ఆధారంగా రిటర్నింగ్ అధికారి ఆ ఉద్యోగులకు ఫారం 12-డి జారీ చేసి వారికి ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తారని తెలిపారు.
పోలింగ్ తేదీ మార్పు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తాజాగా మార్పులు చేసింది. రాజస్థాన్ అసెంబ్లీకి ముందుగా ప్రకటించిన నవంబర్ 23 బదులు నవంబర్ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఎన్నికల ఫలితాలను మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. నవంబర్ 23న రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాహాలు, ఇతర కార్యక్రమాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఈసీ తెలిపింది. భారీ సంఖ్యలో అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని, అదే విధంగా రవాణా విషయంలోనూ సమస్యలు తలెత్తి అవకాశం ఉందని పోల్ సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల తేదీలను వాయిదా వేసినట్లు ఈసీ పేర్కొంది. వివిధ రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు, చేసిన విజ్ఙప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. అయిదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను, ఓట్ల లెక్కింపు తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణలో నవంబర్ 30న, రాజస్థాన్‌లో నవంబర్ 25న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న తొలి విడత, నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న పోలింగ్ జరగగా.. మిజోరాంలో నవంబర్ 7న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలకు డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.