ప్రస్తుతం ఇజ్రాయెల్ లో యుద్ధ వాతావరణం నెలకొందని తెలిసిందే. దాంతో అక్కడ చిక్కకున్న ప్రవాస భారతీయులను దేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం (ఇజ్రాయెల్), ఏపీ ప్రభుత్వ సంస్థ APNRTS హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. 
ఇజ్రాయెల్ లో ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా శాంతి భద్రతలపై ఆందోళన నెలకొన్నందున భారత రాయబార కార్యాలయం కొన్ని ముఖ్య సూచనలు చేసింది. 


ఇజ్రాయెల్ లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఇజ్రాయెల్ ప్రభుత్వ భద్రతా నియమాలను గమనించి జాగ్రత్త వహించాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలని, స్థానిక ప్రభుత్వ అధికారులు సూచించిన విధంగా సురక్షిత ప్రదేశాలకు దగ్గరగా ఉండాలని ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం కొన్ని సూచనలు విడుదల చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితి క్షీణించినప్పుడు, స్వదేశానికి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడితే ప్రవాసాంధ్రులను సురక్షితముగా వెనక్కి తీసుకురావటానికి మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారి కుటుంబాలకు సహాయం చేయడానికి APNRTS సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయంకి ఇమెయిల్ చేసినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు.


హెల్ప్ లైన్ నెంబర్లు..
ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 8500027678 (వాట్సాప్), 0863 2340678 ను సంప్రదించాలని సూచించారు. అలాగే, మీ కుటుంబసభ్యులు, మిత్రులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఇజ్రాయెల్ లో చిక్కుకుపోతే, APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి వివరాలు తెలపగలరని కోరారు. 
ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం, వారి వివరాల నమోదు కొరకు భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్: +972 35226748 లేదా ఇమెయిల్ cons1.telaviv@mea.gov.in ను సంప్రదించాలని సూచించారు. ఇజ్రాయెల్ వెళ్లాలని అనుకునే వారు కూడా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు  ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని APNRTS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూచించారు.