Congress Resolution on Palestine: 



పాలస్తీనాకు మద్దతుగా కాంగ్రెస్ తీర్మానం..


ఇజ్రాయేల్‌ పాలస్తీనా యుద్ధంతో భారత్‌లోని రాజకీయాలూ వేడెక్కాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయేల్‌కి మద్దతునిచ్చారు. స్వయంగా ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అటు కాంగ్రెస్‌ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా పాలస్తీనాకు అండగా ఉంటున్నట్టు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతునిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది. వాళ్ల హక్కులపై ప్రత్యేకంగా ఓ తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) కాంగ్రెస్‌కి చురకలంటించారు. కాంగ్రెస్ చేసిన ప్రకటన పాకిస్థాన్, తాలిబన్ల ప్రకటనలకు ఏ మాత్రం తేడా లేదని విమర్శించారు. ట్విటర్‌ వేదికగా వరస పెట్టి కౌంటర్‌లు ఇచ్చారు.


"హమాస్‌ విపరీత చర్యల్ని ఖండించొద్దు. ఇజ్రాయేల్‌పై జరుగుతున్న దారుణమైన ఉగ్రదాడులపైనా ఏమీ మాట్లాడొద్దు. మహిళలు, చిన్నారులను ఎంత హింసించినా ఏమీ అనొద్దు. ఇదీ కాంగ్రెస్‌ వైఖరి. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టడం కాంగ్రెస్ DNAలోనే ఉంది"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి 






అక్టోబర్ 9వ తేదీన కాంగ్రెస్ పాలస్తీనాకు అనుకూలంగా తీర్మానం పాస్ చేసింది. "పాలస్తీనా ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవంతో బతకాలనుకున్న వాళ్ల ఆకాంక్షల కోసం" కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రకటించింది. ఇజ్రాయేల్, పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వెంటనే ఆగిపోవాలని కోరుకుంటున్నట్టూ చెప్పింది. 


"పాలస్తీనా ప్రజలకు మద్దతుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. వాళ్లు ఆత్మగౌరవంతో బతకాలి. ఇప్పటికిప్పుడు రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గిపోవాలి. రెండు వైపులా చర్చలు మొదలై దౌత్యం ద్వారా సమస్యని పరిష్కరించుకోవాలి. ప్రస్తుత ఘర్షణకు కారణమైన అంశాలపై చర్చించాలి"


- కాంగ్రెస్ 


బీజేపీ కాంగ్రెస్‌ని టార్గెట్‌ చేసి వరుస ట్వీట్‌లు చేస్తున్న క్రమంలో హస్తం పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఒకప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కూడా ఇదే స్టాండ్‌ తీసుకున్నారని గుర్తు చేసింది. అంతర్గతంగా ఈ తీర్మానంపై విభేదాలున్నాయన్న ఆరోపణల్నీ కొట్టి పారేసింది. 


"భారత్‌ జోడో యాత్ర సక్సెస్ తరవాత బీజేపీ కేవలం కాంగ్రెస్ గురించి మాత్రమే మాట్లాడుతోంది. చరిత్రను మరిచిపోతోంది. ఒకప్పుడు పాలస్తీనా గురించి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏం మాట్లాడాలో కూడా ఆ పార్టీకి గుర్తు లేదు"


- గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ లోక్‌సభ డిప్యుటీ లీడర్ 


Also Read: రాజస్థాన్‌ ఎన్నికలకు బ్రేక్‌ వేసిన పెళ్లిళ్లు, పోలింగ్ తేదీని మార్చేసిన ఈసీ