Supreme Court on Abortion:
ఈ సారి ఏం చెప్పిందంటే?
26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు (26 Week Pregnancy Termination) అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది. ఓ మహిళ వేసిన పిటిషన్‌ని విచారించిన కోర్టు...ఇంతకు ముందు ఆ గర్భాన్ని తొలగించుకునేందుకు అంగీకరించింది. సుప్రీంకోర్టు మరో ధర్మాసనం మాత్రం అబార్షన్ అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. రెండు రోజుల వ్యవధిలోనే ఇలా విభిన్నమైన తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు.
ఏంటీ పిటిషన్..?
26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలని ఓ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని, శారీరకంగా మానసికంగా మూడో ప్రసవానికి సిద్ధంగా లేనని చెప్పింది. అయితే...ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అందుకు అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో అబార్షన్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. గర్భంలోని శిశువు పూర్తి ఆరోగ్యంగా జన్మించే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాన్ని గౌరవించాలని సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ విన్నవించారు. అంతకు ముందు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం అబార్షన్‌కి అనుమతినిచ్చారు. మహిళల నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కానీ తల్లీ బిడ్డల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి...మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేశారు. అంతే కాదు. ఈ సమయంలో అబార్షన్ చేస్తే..అది భ్రూణహత్య కిందకే వస్తుందని వాదించారు. ఈ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం..గతంలో ఇచ్చిన తీర్పుతో విభేదించింది. ఇప్పటికిప్పుడు అబార్షన్ ప్రక్రియను ఆపేయాలని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. ఒకవేళ మరోసారి ఇదే పిటిషన్‌తో వస్తే...గతంలో ఇందుకు ఆమోదం తెలిపిన ధర్మాసనానికే ఆ పిటిషన్‌ని బదిలీ చేస్తామని వెల్లడించింది.
అంతకు ముందు ఏం చెప్పారంటే..
వైద్య నివేదికల ప్రకారం, లాక్టేషనల్ అమెనోరియా సమయంలో, గర్భం సాధారణంగా జరగదు. కానీ పిటిషన్ వేసిన మహిళ గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడో బిడ్డను పెంచే పరిస్థితి లేదని, గర్భవిచ్ఛిత్తి అనుమతి ఇవ్వాలని కోరింది. పిటిషనర్ వాదనలను కోర్టు గుర్తించి, తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం స్త్రీకి తన శరీరంపై ఉన్న హక్కును గుర్తిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అసమంజసమైన గర్భం ఒక బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తే ఆ పసికందును పోషించే బాధ్యతలో ఎక్కువ భాగం పిటిషనర్ మీద పడుతుందని పేర్కొంది. ఆ తర్వాత, మహిళ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి సూచించింది. ఇప్పుడు, ఆమె వైద్య నివేదికలు ఆరోగ్య స్థితికి విరుద్ధంగా ఉండడంతో గర్భస్రావం ఉత్వర్వులను కోర్టు వాయిదా వేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం కింద మహిళలకు 20 నుంచి 24 వారాల్లో గర్భవిచ్ఛిత్తి చేసుకునే అధికారం ఉంది.
Also Read: ఢిల్లీలో దారుణం, కారుతో ఢీకొట్టి రోడ్డుపై డ్రైవర్‌ని ఈడ్చుకెళ్లిన దొంగలు - బాధితుడి మృతి