ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి రూ.11 లక్షల నగదు బహుమతులు గెలుపొందే అద్భుత అవకాశాన్ని కలిగించింది . దసరా (Dussehra 2023) సందర్భంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా  ద‌స‌రా పండ‌గకు సరిపడా బ‌స్సులుండ‌వు అవసరం కోసం నాలుగు డొక్కు బ‌స్సులేసి, ఎక్స్‌ట్రా ఛార్జీలు గుంజుతారు అని ఫిక్స్ అయిపోయాము. అయితే ఆ ప‌రిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.  పండ‌గ‌ల వేళ ప్ర‌యాణికుల‌కు కావ‌ల్సిన‌న్ని బ‌స్సులు అందుబాటులో ఉంచి ప్ర‌యాణికుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని టీఎస్ఆర్టీసీ నిర్ణ‌యించింది. అంతేకాదు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌యాణం చేసేవారికి ల‌క్కీడ్రాలో బ‌హుమతులు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. గతంలో రాఖీ పౌర్ణమికి చేసినట్టుగానే  దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.


దసరా సీజన్ వచ్చిందంటే ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోతుంటాయి.  ఎక్కడెక్కడో స్థిరపడినవాళ్లు, వలస జీవులు విజయదశమి వేళ సొంతూర్లకు పయనమవుతుంటారు కాబట్టి భారీ రద్దీ తప్పదు. అందుకే ఆదాయం భారీగా పెంచకునేందుకు ఈ పండుగ సీజన్ ఆర్టీసీలకు మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింతగా ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న చర్యలు తీసుకుంటోంది. 


అక్టోబర్ 21-23, 28-30 తేదీల్లో...


ఈ లక్కీ డ్రా లో భాగంగా  పండగ ముందు అలాగే పండగ తరువాత  అటు మూడు,ఇటు మూడు రోజుల్లో   ఆర్టీసీ బస్సులో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాల్సి ఉంటుంది.  అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు, అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ లక్కీ డ్రా వర్తిస్తుంది. ప్రతి రీజియన్ నుంచి 10 మందికి లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం ఉంటుంది. లక్కీ డ్రా కింద ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున బహుమతి లభిస్తుంది. ఇలా మొత్తం 110 మంది ప్ర‌యాణికుల‌కు రూ.10.89 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తులు ఇస్తామని టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. ల‌క్కీడ్రా వివ‌రాల‌ను 040-69440000, 23450003 నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి క‌నుక్కోవ‌చ్చు. 


గతంలో ..


సెప్టెంబర్ 31న రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని గుర్తు చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. 33 మంది మహిళా ప్రయాణికులను ఎంపిక చేసి వారికి రూ.5.50 లక్షల నగదు పురస్కారం అందజేసి ఘనంగా సంస్థ ద్వారా సత్కరించమన్నారు. ఇప్పుడు అదే  స్ఫూర్తితో దసరా, దీపావళి, సంక్రాంతి, తదితర పండుగలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ప్రతీ బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేస్తుందని, రాఖీ పౌర్ణమి లాగే దసరా లక్కీ డ్రాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తారని టీఎస్ఆర్టీసీ ఆశిస్తోందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెబుతున్న ఆయన ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమయితే  మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.