Viral Video:
ఢిల్లీలో షాకింగ్ ఘటన..
ఢిల్లీలో దారుణమైన ఘటన జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌ని ఓ కార్ ఢీకొట్టింది. దాదాపు 200 మీటర్ల వరకూ రోడ్డుపై లాక్కెళ్లింది. వెనకాల వచ్చే కార్‌లో ఉన్న కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి 11.30 గంటలకు నడి రోడ్డుపై అచేతనంగా పడి ఉన్నాడు బాధితుడు. ఫరియాబాద్‌కి చెందిన బిజేంద్రగా గుర్తించారు. క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ ఇలా ఎందుకు చిక్కుకుపోయాడు..? రోడ్డుపై అతణ్ని ఎందుకలా లాక్కెళ్లారు..? అని పోలీసులు విచారించారు.
ఈ విచారణలో తేలిందేంటంటే...బిజేంద్ర నడుపుతున్న క్యాబ్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. ఈ చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు బిజేంద్ర. అడ్డు తొలగించుకునేందుకు గట్టిగా కార్‌తో ఢీకొట్టారు దుండగులు. అప్పుడే కార్ వెనకాల చిక్కుకున్నాడు. అది పట్టించుకోకుండా దాదాపు 200 మీటర్ల వరకూ అలానే లాక్కుని వెళ్లారు. కొంత దూరం తరవాత రోడ్డుపై పడిపోయాడు బిజేంద్ర. అప్పటికే తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి 1వ తేదీన కూడా ఢిల్లీలో ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది. కంజావాలా ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న యువతిని కార్ ఢీకొట్టింది. దాదాపు 12 కిలోమీటర్ల పాటు అలాగే రోడ్డుపైనే లాక్కెళ్లింది. ఈ ఘటనలోనూ బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులైన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది మే నెలలోనూ హిట్ అండ్ రన్ (Hit And Run) కేసు వెలుగులోకి వచ్చింది. వీఐపీ జోన్‌లోనే ఈ ఘటన జరగడం సంచలనమైంది. కస్తుర్బా మార్గ్‌లో ఓ కార్ టూవీలర్‌ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఇద్దరు ఉన్నారు. ఓ వ్యక్తి ఎగిరి కొంత దూరంలో పడిపోగా మరో వ్యక్తి మాత్రం కార్ రూఫ్‌పై పడిపోయాడు. ఇది తెలిసి కూడా ఆ కార్ డ్రైవర్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇది చూసి గట్టిగా అరిచాడు. కార్ ఆపమని ఎంత చెప్పినా వినకుండా స్పీడ్ పెంచి మరీ వెళ్లిపోయాడు ఆ కార్ డ్రైవర్. దాదాపు మూడు కిలోమీటర్ల వరకూ ఎక్కడా ఆపలేదు. ఢిల్లీ గేట్ వద్ద కార్ రూఫ్‌పై ఉన్న వ్యక్తిని కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో 30 ఏళ్ల దీపాన్షు వర్మ ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: కోల్‌కతా ట్రామ్ సర్వీస్‌లకు 150 ఏళ్లు, దుర్గా మాత థీమ్‌తో స్పెషల్ పెయింటింగ్స్