Kolkata Tram Service: 



కోల్‌కతా ట్రామ్‌కి 150 ఏళ్లు..


పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రామ్ సర్వీస్‌లు (Trams in Kolkata) ఈ ఏడాదితో 150 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. అందుకే చాలా ఘనంగా ఈ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విజయదశమి పండుగ సందర్భంగా...ఈ ట్రామ్స్‌ని దుర్గా మాత థీమ్‌తో పెయింట్స్‌తో నింపేయాలని నిర్ణయించుకుంది. దసరా పూజల్లో చివరి రోజు పెళ్లైన మహిళలు "Sindoor Khela" నిర్వహిస్తారు. ఈ వేడుకల్ని ప్రతిబింబించేలా సిందూరం రంగుతో ట్రామ్‌ని అందంగా తీర్చి దిద్దనుంది. ఇలా స్పెషల్‌గా డిజైన్‌ చేసిన ట్రామ్‌ని బాలీగంజ్, టోలీ గంజ్ మధ్యలో నడపనున్నారు. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకూ ఇది ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలకు యునెస్కో (UNESCO) ట్యాగ్‌ కూడా వచ్చింది. కొత్తగా డిజైన్ చేసిన ట్రామ్‌లో ఈ థీమ్‌ కూడా కనువిందు చేయనుంది. ఈ ట్రామ్‌ కార్‌ వెలుపల కుమార్తులు (Kumortuli) చెందిన హస్త కళాకారులు అందమైన బొమ్మలు వేయనున్నారు. నార్త్ కోల్‌కతాలో దేవుడి ప్రతిమలు చేయడంలో వీళ్లు చాలా ఫేమస్. వీటితో పాటు సిందూర్ ఖేళాకి సంబంధించిన పెయింటింగ్స్‌ కూడా వేశారు. రైలు లోపల కోల్‌కతా సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను వేశారు. 


సిందూర్ ఖేళా థీమ్ 


దుర్గా మాత ముందు మహిళలంతా కలిసి ప్రదర్శించే సిందూర్ ఖేళాతో పాటు ధనుచి నృత్యానికి సంబంధించిన చిత్రాలూ ఇందులో ఉన్నాయి. బెంగాల్‌లో ఎంతో పురాతనమైన సంగీత వాద్యం ఢాకీలను (Dhakis) కొంత మంది పురుషులు కలిసి వాయిస్తున్నట్టుగా కొన్ని పెయింటింగ్స్ వేశారు. ఈ మధ్య కాలంలో మహిళలూ ఈ వాద్యాలను వాయిస్తున్నారు. భారత్‌లో ట్రామ్ సర్వీస్‌లున్న ఒకే ఒక రాష్ట్రం బెంగాల్. ఈ రైళ్లకి కేవలం రెండు బోగీలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్‌తో West Bengal Transport Corporation ముందుకు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ట్రామ్స్‌ని తయారు చేశారు. ఏసీ లైబ్రరీ ట్రామ్‌, ఆర్ట్ గ్యాలరీ ట్రామ్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా స్పెషల్‌ థీమ్‌తో తయారు చేసిన ఆరో ట్రామ్ ఇది. బెంగాల్ మహిళలు మాత్రమే వేయగలిగిన ఫోక్ ఆర్ట్ Alpona కి సంబంధించిన పెయింటింగ్స్‌ కూడా ఈ స్పెషల్ ట్రామ్‌లో కనిపిస్తాయి. ఈ అన్ని పెయింటింగ్స్‌ కింద QR Codeలు ఏర్పాటు చేశారు. విజిటర్స్ వాటిని స్కాన్ చేసి చరిత్రను తెలుసుకోవచ్చు.