Supreme Court: మహిళ గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది.  ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఇచ్చిన ఉత్తర్వుల అమలును వాయిదా వేయాలని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులకు సూచించింది.  ఈ కేసులో కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. వివాహిత గర్భం వైద్య నివేదికలకు అనుమతి విరుద్ధంగా ఉందని వివరించారు. దీంతో అబార్షన్ అనుమతిని మంగళవారం  కోర్టు ఉపసంహరించుకుంది. గర్భవిచ్చితికి అనుమతి ఇచ్చిన తరువాత సదరు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని ఎయిమ్స్‌లోని వైద్య నిపుణులను కోర్టు ఆదేశించింది.


ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ఎదుట అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ప్రస్తావించారు. వైద్య నివేదికలు,  కోర్టు ఉత్తర్వులు వైరుధ్యం కారణంగా AIIMS నిపుణులు డైలమాలో ఉన్నారని వివరించారు. మహిళ కడుపులోని పిండం రూపు దిద్దుకుందని, బతికే అవకాశం ఉందని, అబార్షన్‌‌కు అనుమతిస్తూ ఇస్తూ ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని సీజేఐ ముందు విజ్ఞప్తి చేశారు. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ న్యాయమూర్తులు హిమా కోహ్లి, బీవీ నాగరత్న సోమవారం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రీకాల్ చేయాలని భాటి కోరారు. బిడ్డ సజీవంగా పుట్టే అవకాశం ఉందని వైద్యల నివేదికలు పేర్కొందన్నారు.


దీనిపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. రీకాల్ ఆర్డర్ కోసం అధికారిక దరఖాస్తుతో రావాలని సూచించింది. ఎయిమ్స్‌ వైద్యులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, దీనిపై రేపు ఉదయం బెంచ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటి వరకు ఎయిమ్స్ వైద్యలు వేచి ఉండాలని సూచించారు.


మొదట ఎందుకు అనుమతించారంటే?
సోమవారం, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని బెంచ్, బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందుకు ఇద్దరు పిల్లలు ఉన్న, ప్రస్తుతం గర్భంతో ఉన్న వివాహిత మహిళ కేసు వచ్చింది. తాను ప్రస్తుతం రెండో బిడ్డకు పాలు ఇస్తున్నానని, కానీ అంతలోనే గర్భం దాల్చినట్లు ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. వైద్య నివేదికల ప్రకారం, లాక్టేషనల్ అమెనోరియా సమయంలో, గర్భం సాధారణంగా జరగదు. కానీ సదరు మహిళ గర్భం దాల్చింది. ఆ విషయం ఆమెకు తెలియదు. ఈ నేపథ్యంలో మూడో బిడ్డను పెంచే పరిస్థితి లేదని, గర్భవిచ్ఛిత్తి అనుమతి ఇవ్వాలని కోరింది. పిటిషనర్ వాదనలను కోర్టు గుర్తించి, తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.


న్యాయస్థానం స్త్రీకి తన శరీరంపై ఉన్న హక్కును గుర్తిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అసమంజసమైన గర్భం ఒక బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తే ఆ పసికందును పోషించే బాధ్యతలో ఎక్కువ భాగం పిటిషనర్ మీద పడుతుందని పేర్కొంది.  ఆ తర్వాత, మహిళ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి సూచించింది. ఇప్పుడు, ఆమె వైద్య నివేదికలు ఆరోగ్య స్థితికి విరుద్ధంగా ఉండడంతో గర్భస్రావం ఉత్వర్వులను కోర్టు వాయిదా వేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం కింద మహిళలకు 20 నుంచి 24 వారాల్లో గర్భవిచ్ఛిత్తి చేసుకునే అధికారం ఉంది.