గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత నెలలోనే 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ). ఎలక్ట్రిక్ బస్సులు అలా రోడ్డెక్కాయో లేదో... ఇలా ప్రయాణికుల మనసు దోచుకున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించేందుకు హైదరాబాద్ వాసులు ఇష్టపడుతున్నారు. దీంతో 25 ఎలక్ట్రిక్ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నారు. దీంతో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తోంది టీఎస్‌ఆర్టీసీ.
గ్రేటర్ పరిధిలో తిరుగుతున్న 25 విద్యుత్ బస్సుల్లో 10 బస్సులను పుష్పక్ పేరుతో ఎయిర్‌పోర్టు వరకు నడుపుతున్నారు. మిగిలిన 15 బస్సులను బాచుపల్లి నుంచి వేవ్‌రాక్, సికింద్రాబాద్ నుంచి వేవ్‌రాక్ వరకు రెండు మార్గాల్లో నడుపుతున్నారు. ఈ బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ బస్సులో జర్నీ చేసేందుకు నగర ప్రయాణికులు ఇష్టపడుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ బస్సుల్లో 100 శాతం ఆక్యూపెన్సీ నమోదవుతోంది. ఫలితంగా ఆర్టీసీకి లాభాల పంట పండుతోంది.
ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న బాచుపల్లి నుంచి వేవ్‌రాక్, సికింద్రాబాద్ నుంచి వేవ్‌రాక్ మార్గాల్లో ఐటీ, బ్యాంకు, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారని సమాచారం. ప్రయాణ దూరం ఎక్కువైనా... ఏసీలో హ్యాపీగా వెళ్లొచ్చని వీరంతా ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారని అంచనా వేస్తున్నారు. అంతేకాద... విద్యుత్ ఏసీ బస్సుల్లో టికెట్ చార్జీలు కూడా తక్కువే. సామాన్యులకు అందుబాటులోనే చార్జీలు ఉంటున్నాయి. 50 నుంచి 60 రూపాయలతోనే ప్రయాణించవచ్చు. మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలతో పోలిస్తే.. 5రూపాయలు మాత్రమే అదనం. పైగా ఎలక్ట్రిక్ బస్సుల్లో ఏసీ ఉంటుంది. దీంతో... చాలా మంది ఎలక్ట్రిక్ బస్సులను ప్రిఫర్ చేస్తున్నారు. ఇక... నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్డుకు వెళ్లే పుష్పక్ బస్సులతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బస్సుల్లో చార్జీలు చాలా తక్కువ. ఇది కూడా ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు ఒక కారణమని అంటున్నారు ఆర్టీసీ అధికారులు.
ఏదిఏమైనా ఎలక్ట్రిక్ బస్సులు.. హైదరాబాద్ నగర ప్రయాణికుల మనసు దోచుకుంటున్నాయి. దీంతో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది టీఎస్‌ఆర్టీసీ. మరో వెయ్యి విద్యుత్ బస్సులను త్వరలోనే రోడ్డెక్కించబోతున్నారు. రెండు, మూడు నెలల్లో మరో వెయ్యి విద్యుత్ బస్సులు రాబోతున్నాయని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల పర్యావరణ హానికలగదు. అందుకే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు చేరువ చేసి.. దశలవారీగా ఆ బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్‌లో వాహన సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడంతో... పొల్యూషన్ కూడా సృతి మించుతోంది. గాలి మొత్తం దుమ్ముదూళితో నిండిపోతోంది. వాయు కాలుష్యంతోపాటు శబ్ద కాలుష్యం... నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయేలా చేస్తోంది. ఇలానే కొనసాగితే... హైదరాబాద్ కూడా పొల్యూషన్‌లో మరో ఢిల్లీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే టీఎస్‌ఆర్టీసీ అధికారులు... ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెడుతున్నారు. నగరంలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే బస్సులను తగ్గించి.. క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులను నగర వాసులకు చేరువచేసే ప్రయత్నం చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల వాయు, శబ్ధ కాలుష్యం తగ్గుతుంది. దీని వల్ల వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది. అందుకే ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచబోతోంది టీఎస్‌ఆర్టీసీ.
హైదరాబాద్‌లో రెండు, మూడు నెలల్లో మరో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయని అధికారులు ప్రకటించారు. అయితే... ఈ బస్సులో 50 మాత్రం ఏసీ బస్సులు. మిగిలినవి నాన్ ఏసీ బస్సులు. ఈ బస్సులను పలు మార్గాల్లో నడపున్నారు. ఈ బస్సుల్లో చార్జీలు కూడా తక్కువగా ఉంటాయని చెప్పారు. దీంతో ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.