టాలీవుడు నటుడు నవదీప్‌ను 8గంటలకుపైగా ప్రశ్నించారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి దర్యాప్తు చేశారు. నిన్న (మంగళవారం) ఉదయం సుమారు 10గంటల 40 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి వెళ్లారు నవదీప్‌. తనకు సంబంధించిన మూడు బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు, స్టేట్‌మెంట్లను ఈడీ అధికారులకు అందించారు. అంతేకాదు పాన్‌కార్డుతోపాటు ఈడీ అడిగిన అన్ని పత్రాలను సమర్పించారు. నిన్న సాయంత్రం ఏడున్నర వరకు నవదీప్‌ను ప్రశ్నించింది ఈడీ అధికారుల బృందం. 


2017లో నమోదైన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నమోదు చేసిన కేసుతో మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వారిలో నైజీరియాకు చెందిన అమోబీ, మైఖల్, థామస్‌తో పాటు కొల్లి రాంచంద్​ నిందితులుగా ఉన్నారు. కొల్లి రాంచంద్‌ను విచారించినపుడు హీరో నవదీప్ ​అతని దగ్గర డ్రగ్స్ ​కొనేవాడని వెల్లడైంది. మనీలాండరింగ్‌ జరిగినట్టు కూడా తేలింది. దీంతో నవదీప్‌ ఆర్థిక లావాదేవీలపై ఎంక్వైరీ మొదలైంది. కొందరు నైజీరియన్ల బ్యాంకు ఖాతాలకు.. నవదీప్‌ అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్లినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అందుకే ఆయన్ను పలిచి ప్రశ్నించారు. జాయింట్‌ డైరెక్టర్‌ రోహిత్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల బృందం నవదీప్‌ను 8గంటలకుపైగా క్వశ్చన్‌ చేసింది. ఇప్పటికే ఒకసారి నవదీప్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. నిన్న (మంగళవారం) కూడా 8గంటలకుపైగా ప్రశ్నించారు. నవదీప్‌ ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువగా ఆరా తీసినట్టు తెలుస్తోంది.


మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన రామ్‌చంద్‌ నవదీప్‌కు అత్యంత సన్నిహితుడని పోలీసులు చెప్తున్నారు. రామ్‌చంద్‌ది వరంగల్‌. ఆయన బెంగళూరులో ఉంటున్న  నైజీరియన్లు అమోబి, మైకేల్, థామస్‌ దగ్గర డ్రగ్స్‌ కొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ డ్రగ్స్‌ను హైదరాబాద్‌ తీసకొచ్చి విక్రయించినట్టు తేల్చారు. ఇందులో నవదీప్‌కు కూడా  డ్రగ్స్‌ అందించేవాడని అనుమానిస్తున్నారు. అంతేకాదు డ్రగ్స్‌ కేసులో నిందితులుగా ఉన్న నైజీరియన్లతో నవదీప్‌ ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు కూడా ఈడీ అధికారులు  భావిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది. దీనిపై నిగ్గు తేల్చేందుకు... నైజీరియన్లతో నవదీప్‌ లింకులను బయటపెట్టేందుకు ఈడీ  అధికారులు నవదీప్‌కు నోటీసుల ఇచ్చి ఆఫీసుకు పిలిపించుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం.


మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసే కాదు... 2017లో నమోదైన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కూడా నవదీప్‌ నుంచి వివరాలు రాబడుతున్నారు ఈడీ అధికారులు. 2017లో తెలంగాణ  ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన డ్రగ్స్‌ కేసులలో కీలక నిందితుడు కెల్విన్‌ పట్టుబడిన తర్వాత... టాలీవుడ్‌తో డ్రగ్స్‌ లింకులు బయటపడ్డాయి. అప్పటి నుంచే ఈడీ  మనీలాండరింగ్‌పై ఫోకస్‌ చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు... 2021లో నవదీప్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ నటులను ప్రశ్నించారు. ఇప్పుడు మాదాపూర్‌  డ్రగ్స్‌ కేసు విచారణలోనూ నవదీప్‌ పేరు వినిపించడంతో.. అతనిపై ఫోకస్‌ చేశారు ఈడీ అధికారులు. నైజీరియన్లత్ నవదీప్ లింకులు.. డ్రగ్స్‌ కేసుల్లో నవదీప్‌ పాత్రపై కూపీ  లాగుతున్నారు.