Jharkhand Governor Invites Champai Soren For Forming Government: మనీ లాండరింగ్ కేసులో ఝార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు వీడింది. జేఎంఎం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సోరెన్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. 81 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో తనకు 48 మంది మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చంపై సోరెన్ రెండోసారి చేసిన వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. 'చంపై సోరెన్ ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాం. ఎప్పుడు ప్రమాణం చేస్తారో ఆయనే నిర్ణయించుకోవాలి.' అని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నితిన్ మదన్ కులకర్ణి అన్నారు. కాగా, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. ఈడీ విచారణతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది.
10 రోజుల్లో బలపరీక్ష
మరోవైపు, ప్రభుత్వ మెజార్టీ నిరూపణ కోసం కొత్తగా సీఎంగా ఎన్నికైన చంపై సోరెన్ కు గవర్నర్ 10 రోజుల సమయం ఇచ్చారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నానికి చంపై సోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని ఝార్ఖండ్ సీఎల్పీ నేత ఆలంగీర్ ఆలం తెలిపారు.
గవర్నర్ జాప్యంపై ఆగ్రహం
సీఎంగా తనను నియమించాలన్న చంపై సోరెన్ అభ్యర్థనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంపై మరోసారి గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న నేతను సీఎంగా ప్రమాణం చేయడానికి పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, ప్రజాతీర్పును కాలరాసినట్లేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం గవర్నర్ తీరును తప్పుబట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో అర్ధరాత్రి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చంపైకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది.
ఆఖరి నిమిషంలో మారిన వ్యూహం
ఝార్ఖండ్ లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి ముందుగా తమకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేలను 2 ప్రైవేట్ విమానాల్లో హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేసింది. అయితే, రాంచీ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా అవి అక్కడే నిలిచిపోయాయి. దీంతో వారు ఇక్కడకి రాలేకపోయారు. ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం మేరకు గురువారం రాత్రికే 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు కూడా చేశారు. బేగంపేట విమానాశ్రయంలో రాత్రి 10 గంటల వరకూ ఎదురుచూసి చివరకు పర్యటన రద్దు కావడం వల్ల వెనుదిరిగారు.
Also Read: Gyanvapi: తెరుచుకున్న 'జ్ఞానవాపి' భూగర్భ గృహం - 30 ఏళ్ల తర్వాత పూజలు