Gyanvapi Pujas After Three Decades: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి (Gyanvapi) కాంప్లెక్స్ బేస్ మెంట్ లో దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరిగి పూజలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరంలోని భూగర్భ గృహంలో హిందువుల దేవతా విగ్రహాలకు బుధవారం రాత్రి పూజలు చేశారు. దీని కోసం ఓ పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వారంలోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ (Kasi Viswanath Trust) ప్రకటించినప్పటికీ.. కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే సీల్ వేసి ఉన్న భూగర్భ గృహం మార్గాన్ని తెరిచే ఏర్పాట్లు చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగం, పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు.






అర్ధరాత్రి పూజలు


బుధవారం రాత్రి 9 గంటల తర్వాత కాశీ విశ్వనాథ్ ఆలయ ద్వారం గుండా కాంప్లెక్స్ లోకి ప్రవేశించిన అధికారులు బారికేడ్లు తొలగించి పరిసరాలు శుభ్రం చేయించారు. ఒంటిగంట సమయంలో గణేశ లక్ష్మి పూజతో ప్రారంభించి, తర్వాత నంది మహరాజ్ ఎదుట పూజలు చేశారు. హారతితో పాటు మంగళ వాయిద్య శబ్దాలు చేసి దీపాలు వెలిగించారు. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక సుమారు 2 గంటలకు కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చారు. సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తో పాటు కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 'కోర్టు ఆదేశాలు పాటిస్తూనే పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథ ట్రస్ట్ పూజారి శయన హారతి నిర్వహించి విగ్రహాల ముందు అఖండ జ్యోతి వెలిగించారు. రోజుకు నాలుగుసార్లు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.' అని జైన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాదాపు 31 ఏళ్ల తర్వాత పూజల కోసం ఈ గృహం తెరుచుకున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే వెల్లడించారు. మరోవైపు, జిల్లా కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి ప్రాంతంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. సుమారు 16 పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన బలగాలతో రామనగరం లంక, దశశ్వమేధ్, లక్స సిగార వంటి ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు.


సుప్రీంకోర్టుకు ముస్లిం ప్రతినిధులు


జ్ఞానవాపి బేస్ మెంట్లో పూజలు చేసిన నేపథ్యంలో ముస్లిం వర్గ ప్రతినిధులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడాన్ని జ్ఞానవాపి మసీద్ కమిటీ గురువారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను కోరారు. అయితే, ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించినట్లు రిజిస్ట్రార్ వారికి తెలిపారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ముస్లిం వర్గ ప్రతినిధులు సిద్ధమయ్యారు. మరోవైపు, హిందు వర్గం ప్రతినిధులు సైతం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా, జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తూ జిల్లా కోర్టు ఈ నెల 31న సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే ASI సర్వే స్పష్టం చేయగా.. Vyas Ka Tekhana ప్రాంతం వద్ద హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.


ఏఎస్ఐ రిపోర్టులో ఏముందంటే.?


జ్ఞానవాపి వివాదంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఇచ్చిన రిపోర్టు  (ASI Survey Report) జనవరి 25న విడుదలైంది. ప్రస్తుతం ఉన్న మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉన్నట్లుగా ఏఎస్ఐ అధికారులు గుర్తించారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని పురావస్తు శాఖ తేల్చింది. ఆ మసీదు కింద ఓ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించారు. హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను చెక్కి మసీదు నిర్మాణంలో వాడినట్లుగా గుర్తించారు. జ్ఞానవాపి మసీదు కింది భాగంలో కొన్ని దేవతల విగ్రహాలు ఉన్నట్లుగా కూడా పురావస్తు నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. ఈ రిపోర్టును ఏఎస్ఐ అధికారులు ఈ కేసులో ఇరు పక్షాలకు కాపీలను అందించారు. హిందూ తరఫు న్యాయవాది విష్ణు జైన్ ఏఎస్ఐ నివేదికలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఏఎస్‌ఐ రిపోర్టులో ఉన్న అంశాలన్నీ డాక్యుమెంట్‌గా ఉన్నాయని తెలిపారు. కట్టడాలకు ఎలాంటి హాని జరగకుండా నిపుణులు సైంటిఫిక్ సర్వే చేశారని వివరించారు. ఆ రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. కారిడార్ పక్కనే ఓ బావి కనిపించిందని విష్ణు జైన్ చెప్పారు. ఇక్కడ కనిపించే పూర్వ నిర్మాణం చాలా పెద్ద హిందూ దేవాలయం అని అన్నారు. ఏఎస్‌ఐ జీపీఆర్‌ సర్వే ప్రకారం హిందూ దేవాలయంలోని స్తంభాలపై నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ ఒక గొప్ప హిందూ దేవాలయం ఉండేదని చెప్పవచ్చు. ఏఎస్ఐ నివేదిక ప్రకారం.. మసీదు కంటే ముందు హిందూ దేవాలయం ఉందని అన్నారు.


Also Read: Interim Budget 2024: 57 నిమిషాల బడ్జెట్ ప్రసంగం - అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఏదంటే?