Interim Budget 2024 New Housing Scheme: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మధ్యంతర బడ్జెట్ - 2024 ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ (New Housing Scheme) తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇళ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నిజం చేస్తామని అన్నారు. మురికివాడలు, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు ఇళ్లు కట్టుకోవడానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని వెల్లడించారు. ఇందు కోసం జిల్లాలు, బ్లాక్ ల అభివృద్ధి కోసం రాష్ట్రాల కోసం పని చేస్తున్నామని తెలిపారు.
'3 కోట్ల ఇళ్ల నిర్మాణం'
పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టేలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మధ్య తరగతికి సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన 'పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్' కరోనా కాలంలోనూ కొనసాగించామని.. త్వరలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు తెలిపారు.పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఐదేళ్లు ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
ఉచిత విద్యుత్
సామాన్యులకు విద్యుత్ బిల్లుల నుంచి ఊరట కల్పించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ - 2024 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీని వల్ల ఏటా గృహ వినియోగదారులకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ ఆదా అవుతుందని అన్నారు. కాగా, ఈ పథకంపై ప్రధాని మోదీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
భారీగా రుణసాయం
వివిధ పథకాల ద్వారా ప్రజలకు భారీగా రుణ సాయం చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. '78 లక్షల వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు మంజూరు చేశాం. మరో 2.30 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం. డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా జన్ దన్ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2.7 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల మంది యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువైన రుణాలు మంజూరు చేశాం.' అని వివరించారు.
Also Read: Railway Budget 2024: రైల్వేకు కొత్త సొబగులు - బడ్జెట్ లో రైల్వే శాఖకు కేటాయింపులు ఇలా!