Nirmala Sitharaman Railway Budget 2024 Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో రైళ్లు, విమానయాన రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథకం కింద 3 కారిడార్లను నిర్మిస్తామని చెప్పారు. ఈసారి రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించగా.. 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని అన్నారు. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత పెంచేలా బోగీలను మారుస్తామని చెప్పారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నట్లు వెల్లడించారు. ఇంధనం - మినరల్ - సిమెంట్, పోర్ట్ కనెక్టివిటీ, హై ట్రాఫిక్ డెన్సిటీ ఇలా 3 ఆర్థిక కారిడార్లను పీఎం గతిశక్తి కార్యక్రమం కింద అమలు చేయనున్నట్లు వివరించారు. 'హై ట్రాఫిక్ డెన్సిటీ వల్ల ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీని వల్ల ప్రయాణికుల భద్రత పెరిగి.. ప్రయాణ వేగం కూడా పెరుగుతుంది. ఈ 3 ఆర్థిక కారిడార్లు మన జీడీపీ వృద్ధి వేగవంతం చేయడంలో ఉపయోగపడతాయి.' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
విమానయాన రంగంపై
విమానయాన రంగంపైనా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో కొత్త విమానాశ్రయాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. దశాబ్ద కాలంలో విమానాశ్రయాల సంఖ్యను 149కు పెంచనున్నట్లు చెప్పారు. టైర్ 2, టైర్ 3 నగరాలకు కొత్త విమాన సర్వీసులు తీసుకొస్తామని చెప్పారు. 'మన విమానయాన సంస్థలు 100 విమానాలకు పైగా ఆర్డర్ చేశాయి. ఈ పరిణామమే దేశ విమానయాన రంగ అభివృద్ధిని తెలియజేస్తోంది. చమురు రవాణా చేసే వాటిల్లో నేచురల్ బయో గ్యాస్ తో కంప్రెస్డ్ బయో గ్యాస్ ను కలపడం తప్పనిసరి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్స్, ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులు ప్రోత్సహించాం.' అని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రత్యామ్నాయాలు అందించేలా బయో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఫౌండరీ పథకం కింద బయో డీగ్రేడబుల్ ప్రారంభిస్తామని అన్నారు. అలాగే, దేశంలో వివిధ నగరాలను మెట్రో రైలు, నమో భారత్ తో అనుసంధానించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
తెలుగు రాష్ట్రాలకు ఇలా
తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధి కోసం మధ్యంతర బడ్జెట్ - 2024లో దాదాపు రూ.14 వేల కోట్లకు పైగా కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించగా.. తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు డీఎపీఆర్ సిద్ధమైందని అన్నారు. రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని.. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం భూమి అప్పగించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుత బడ్జెట్ లో గతంలో కంటే 10 శాతం రెట్టింపు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఏడాదికి 240 కి.మీల ట్రాక్ పనులు జరుగుతున్నాయని.. ఏపీలో 98 శాతం విద్యుదీకరణ పూర్తైందన్నారు. అటు, తెలంగాణలోనూ 100 శాతం విద్యుదీకరణ పూర్తైందని చెప్పారు. రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్న రైల్వే మంత్రి.. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయని అన్నారు.
Also Read: Budget 2024: వికసిత్ భారత్ లక్ష్యానికి తగ్గట్టుగా ఉంది - నిర్మలమ్మ పద్దుపై ప్రధాని ప్రశంసలు