LPG Cylinder Price Hike: తాత్కాలిక బడ్జెట్ (Interim Budget 2024) నెపంతో కామన్‌మ్యాన్‌కి కనీసం ఒక్క శుభవార్త కూడా చెప్పని కేంద్ర ప్రభుత్వం, గ్యాస్ ధరల విషయంలోనూ నిరాశపరిచింది. వాస్తవానికి, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందే కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి. తాత్కాలిక బడ్జెట్ + సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈసారైనా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తారేమోనని ఎదురు చూసిన సామాన్య జనానికి కేంద్రం రిక్తహస్తం చూపింది. ఆహార పదార్థాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనానికి, ఫిబ్రవరి నెలలోనూ గ్యాస్ బండ గుదిబండగా మారింది.
ఈ నెల ప్రారంభం (01 ఫిబ్రవరి 2024) నుంచి వర్తించేలా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రేటును చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెంచాయి. ఇప్పుడు, కమర్షియల్ సిలిండర్ కొనాలంటే ఇంకాస్త ఎక్కుడ డబ్బును వ్యాపారులు ఖర్చు చేయాలి.
దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కిలోల LPG సిలిండర్ కొత్త ధరలు ఇవి:
దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 14 పెరిగి రూ. 1769.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 18 పెరిగి రూ.1887 కు; ముంబైలో రూ. 15 పెరిగి రూ. 1723.50 కు; చెన్నైలో రూ.12.50 పెరిగి రూ. 1937 కు చేరింది.
ప్రభుత్వ చమురు కంపెనీలు, 01 జనవరి 2024న, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తూతూమంత్రంగా కేవలం రూపాయిన్నర తగ్గించాయి. ఆ నెలలోకూడా 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ప్రైస్‌ను తగ్గించలేదు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
రూటు మారని దేశీయ గ్యాస్ సిలిండర్ రేటు
సామాన్య ప్రజలకు ఈసారి కూడా ఊరట దక్కలేదు. ఇంట్లో వంటకు ఉపయోగించే 14 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ రేటును OMCలు ఈసారి కూడా తగ్గించలేదు. చివరిసారిగా, 2023 ఆగస్టు 30న, డొమొస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లను కేంద్ర సవరించింది. అప్పటి నుంచి, ఆరు నెలలుగా రేట్లు తగ్గించకుండా అధిక స్థాయిలోనే కొనసాగిస్తోంది.
ప్రస్తుతం, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర (Domestic LPG Cylinder Price Today) దిల్లీలో రూ. 903, కోల్‌కతాలో రూ. 929, ముంబైలో రూ. 902.50, చెన్నైలో రూ. 918.50, హైదరాబాద్‌లో రూ. 955, విజయవాడలో రూ. 944.50 గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.
LPG సిలిండర్ కొత్త రేట్లను ఎలా తెలుసుకోవాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' IndiGo, Tata Motors, Titan, Paytm