Apple Tapping:
యాపిల్‌కి నోటీసులు..
కేంద్ర ఐటీ శాఖ యాపిల్ కంపెనీకి (Apple Company) నోటీసులిచ్చింది. విపక్షాలకు చెందిన కొందరు నేతలు తమ ఐఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ మొబైల్స్‌కి ఇప్పటికే అలెర్ట్ మెసేజ్‌లు వచ్చాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం సీరియస్ అయింది. విపక్షాలు దీన్ని 'state-sponsored attack'గా ఆరోపించడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఆరోపణలపై క్లారిటీ ఇవ్వాలని యాపిల్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది కేంద్రం. తక్షణమే స్పందించాలని ఆదేశించింది. ఇది టార్గెట్ అటాక్ అనడానికి ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. అవి ఉంటే వెంటనే సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యాపిల్ ఫోన్స్‌ని రిమోట్‌గా యాక్సెస్ చేయొచ్చా లేదా అన్న అంశంపైనా వివరణ అడిగింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి విపక్ష నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. వీటిని అంత సులభంగా తీసుకోమని, కచ్చితంగా విచారణ చేపడతామని స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీ ప్రత్యేకంగా ఓ మీటింగ్ పెట్టి ఈ సమస్యపై చర్చించాలని ఇప్పటికే పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే...ఈ ట్యాపింగ్‌కి జార్జ్ సోరోస్ (George Soros)కి ఏమైనా లింక్స్ ఉన్నాయా అన్న కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. రాహుల్ గాంధీ ఎలాంటి ఆధారాల్లేకుండానే ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీజేపీ మండి పడుతోంది. Computer Emergency Response Team (CERT-In) ఇప్పటికే విచారణ మొదలు పెట్టింది. యాపిల్ ఈ విచారణకు సహకరిస్తుందని వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉన్న హ్యాకర్‌లే తమ ఫోన్‌లు ట్యాప్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించడం సంచలనం సృష్టించింది. దీనికి తోడు యాపిల్ కంపెనీ కొందరికి వార్నింగ్ అలెర్ట్స్ కూడా పంపింది. ఈ అంశాన్ని మోదీ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యాపిల్ అధికారులకు సమన్లు జారీ చేసే యోచనలో ఉంది. త్వరలోనే వాళ్లతో భేటీ కానుంది. కీలక నేతలతో పాటు ప్రముఖుల ఐఫోన్‌లకు హ్యాకింగ్ అలెర్ట్ పంపడంపై చర్చించనుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సెక్రటేరియట్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వెల్లడించింది. దీన్ని అంత సులభంగా తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. విపక్ష నేతలు వీటిని state-sponsored attacksగా చెబుతున్నారు. ఈ అలెర్ట్స్ వచ్చిన వాళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, సుప్రియా శ్రీనాతే, టీఎస్ సింగ్‌దియో, భూపిందర్ సింగ్ హుడా, టీఎమ్‌సీ ఎంపీ మహువా మొయిత్రా, సీపీఐ (ఎమ్) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సమాద్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నారు.
Also Read: Arvind Kejriwal: ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్- మధ్యప్రదేశ్ వెళ్లనున్నట్టు ఆప్ వివరణ