Marriage Equality: స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరిస్తూ అక్టోబరు 17న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉదిత్ సూద్ అనే వ్యక్తి రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని సవాలు చేశారు. కోర్టు వెలువరించిన తీర్పులో లోపాలు ఉన్నాయని,  పూర్తి అన్యాయమైనదని పిటిషనర్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘన జరుగుతోందని రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు. 


స్వలింగ సంపర్కులపై జరిగే వివక్షను అంతం చేయడంలో విఫలమయ్యారని రివ్యూ్ పిటిషన్‌లో తెలిపారు. న్యాయమూర్తులు భట్, హిమా కోహ్లీ, నరసింహల మెజారిటీ అభిప్రాయం అత్యున్నత న్యాయస్థానం అధికార పరిధిని తటస్థీకరించారని పేర్కొన్నారు. అయితే వివక్ష, పిటిషనర్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన గుర్తింపు అనేది కోర్టు బాధ్యత అని, ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందన్నారు. పిటిషనర్లు వివక్షను భరిస్తున్నారని గుర్తించడం, దానిని భవిష్యత్తు తొలగించేందు, విలక్షణమైన స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పన అవసరం ఉందన్నారు.  


అక్టోబర్ 17న తీర్పు వెలవరించిన ధర్మాసనం
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత ధ్రువీకరణపై దాఖలైన పిటిషన్లపై అక్టోబర్ 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ వర్గాలకు చెందిన వ్యక్తుల వివాహానికి తాము చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. వారు సహజీవనంలో ఉండొచ్చని పేర్కొంది. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని 20 స్వలింగ జంటలు వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4 వేర్వేరు తీర్పులను వెల్లడించింది. 


దీనిపై పార్లమెంటే చట్టం చేయాలన్ని ధర్మాసనం, స్వలింగ సంపర్కం జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రత్యేక వివాహ చట్టాన్ని మార్చడం పార్లమెంట్ విధి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయస్థానం చట్టాన్ని రూపొందించదని, కానీ దాన్ని అర్థం చేసుకుని అమలు చేయగలదని పేర్కొన్నారు. స్వలింగ వివాహాలపై చట్టబద్ధత కోరుతూ దాఖలైన 21 పిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.


నగరాలకే పరిమితం కాదు
హోమో సెక్సువాలిటీ కేవలం నగరాలు, ఉన్నత వర్గాలకు పరిమితం కాదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా.. లేదా..? అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని తెలిపారు. భిన్న లింగ జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించడం లేదని, అలా భావిస్తే అది స్వలింగ సంపర్కులపై వివక్షే అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. అందరినీ సమానంగా చూడాలని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. 


హక్కులను కాపాడాలి
ప్రతి ఒక్కరికీ వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ చట్టబద్ధతపై తీర్పు వెల్లడిస్తూ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించడం ప్రాథమిక హక్కు. ఈ హక్కులను ప్రభుత్వమే కాపాడాలి.' అని పేర్కొన్నారు. వివాహానికి చట్టబద్ధమైన హోదా ఉంటుందని, అది ప్రాథమిక హక్కు కాదని అన్నారు. ఒకవేళ, అలాంటి వాటికి చట్టపరమైన హోదా ఇస్తే అవసరమైన వారు హక్కులు పొందుతారని సీజేఐ వెల్లడించారు.