Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు గైర్హాజరవుతున్నారు. షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో రోడ్ షో నిర్వహించాల్సి ఉంది. కాసేపట్లో కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలికి వెళ్లనున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు వెళ్లడం లేదని ఆప్‌ నేతలు చెబుతున్నారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇస్తూ ఓ నోట్ విడుదల చేశారు. పార్టీకి నేషనల్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. తన అవసరం ఎక్కడున్నా అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. అంతే కాదు. ఈ సమన్లను వెనక్కి తీసుకోవాలని అన్నారు. 


"ఆప్‌కి నేషనల్ కన్వీనర్‌గా, స్టార్ క్యాంపెయినర్‌గా నేను కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు కార్యకర్తలతో,నేతలతో మాట్లాడాలి. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఎక్కడ నా అవసరం ఉందో అక్కడ నేను ఉండాలి. దయచేసి ఈ సమన్లను వెనక్కి తీసుకోండి. ఇవి కచ్చితంగా రాజకీయ కుట్రే. చట్టపరంగా ఇవేవీ నిలబడవు"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి