Chandrayaan-3: చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలో మూడోసారి కక్ష్యను మార్చుకున్న చంద్రయాన్-3.. తాజాగా జాబిలిని తన కెమెరాల్లో బంధించింది. చంద్రయాన్-3 లో ఉన్న ల్యాండర్ ఇమేజ్ కెమెరాల నుంచి భూమిని ఫోటో తీసింది. చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత చంద్రుడి ఫోటోను తీసి పంపించింది. ల్యాండర్ హారిజంటల్ వెలాసిటీ కెమెరా ఈ ఫోటోలను క్లిక్‌మనిపించింది. తాజాగా పంపిన ఫోటోలో చంద్రుడి క్రాటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎడ్డింగ్టన్, అరిస్టార్‌చస్, పైతాగరస్, ఓసియన్ ప్రొసెల్లరమ్ లాంటి బిల్హాలు ఈ తాజా చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రుడి ఉత్తర ధ్రువంలో ఉన్న బిల్వాల్లో, ప్రొసెల్లరమ్ చాలా పెద్దది. ఈ ప్రొసెల్లరమ్ సుమారు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే 4 లక్షల చదరపు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. బుధవారం రోజు కక్ష్య మార్పుతో ప్రస్తుతం చంద్రయాన్-3.. 174 కి.మీ X 1,437 కి.మీ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. తదుపరి కక్ష్య మార్పు ఆగస్టు 14వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య జరగనుంది. సోమవారం, ఇస్రో చంద్రయాన్-3 ఎత్తును దాదాపు 14 వేల కిలోమీటర్ల మేర తగ్గించింది. ఆగస్టు 16వ తేదీన చంద్రయాన్-3 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 17న ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోనుంది.
ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత, ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్ ను పెరిలున్ (చంద్రునికి అత్యంత సమీపంలోని స్థానం) 30 కిలోమీటర్లు, అపోలూన్ (చంద్రునికి దూరమైన స్థానం) 100 కిలోమీటర్ల కక్ష్యలోకి డీ-బూస్ట్ చేస్తుంది. చివరి ల్యాండింగ్ ఈ కక్ష్య నుంచి జరగనుంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ఈనెల 23న చంద్రయాన్ చంద్రుడిపై దిగుతుంది. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
జులై 14వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టగా.. జులై 15, 25 తేదీల మధ్య 5 భూకక్ష్యలను మార్చుకుంది. ఆగస్టు 1వ తేదీన ట్రాన్ లూనార్ ఇంజెక్షన్ విన్యాసాన్ని చేపట్టింది. దాదాపు 3.6 లక్షల కిలోమీటర్ల ఎత్తులో చంద్రుని వైపు కదిలింది. ఆగస్టు 5వ తేదీన చంద్రుని కక్ష్య(లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్)లోకి ప్రవేశించింది. 6వ తేదీన సాయంత్రం వేళ చంద్రునికి మరింత దగ్గరగా వెళ్లేందుకు మరో కక్ష్యను మార్చుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కావడనికి చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలను మార్చాల్సి ఉంటుంది.