Israel Gaza War: 


శరద్ పవార్ వ్యాఖ్యలు..


నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) ప్రెసిడెంట్ శరద్ పవార్‌ ఇజ్రాయేల్‌ హమాస్ యుద్ధంపై (Israel Hamas War) స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా కన్‌ఫ్యూజన్‌ స్టేట్‌లోనే ఉందని విమర్శించారు. పాలస్తీనా వ్యవహారంలో ఏ వైపు నిలబడాలో తేల్చుకోలేకపోతోందని అన్నారు. చరిత్రను గమనిస్తే భారత్ ఎప్పుడూ పాలస్తీనాకే మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఇజ్రాయేల్‌కి ఎప్పుడూ అండగా ఉండలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయేల్‌కి మద్దతునిచ్చారని, కానీ విదేశాంగ శాఖ మంత్రి అందుకు భిన్నమైన ప్రకటన చేసిందని అన్నారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ దాడులు మొదలయ్యాయి. అక్టోబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై స్పందించారు. ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించిందని ప్రకటించారు. ఇజ్రాయేల్‌కి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 10వ తేదీన ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహుతో ప్రధాని మోదీ మాట్లాడారు. రెండ్రోజుల తరవాత అక్టోబర్ 12న విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బగ్చీ (Arindam Bagchi) స్పందించారు. పాలస్తీనాకు స్వతంత్ర హోదా ఇచ్చే విషయంలో భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుందని, అందుకు మద్దతునిస్తుందని ప్రకటించారు. దీనిపైనే శరద్ పవార్ విమర్శలు చేశారు. 


బీజేపీ ఆగ్రహం..


ఒకే విషయంలో భారత్‌ ఇలా భిన్నంగా స్పందించడం ఏంటని ప్రశ్నించారు. అక్కడ వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే భారత్‌ ఇలా వ్యవరించడం ఏ మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయేల్, హమాస్ యుద్ధంపై తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. అయితే..ఈ ఓటింగ్‌కి భారత్ దూరంగా ఉంది. దీనిపైనే శరద్ పవార్‌ని ప్రశ్నించగా...ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కాదు. యుద్ధం మొదలైనప్పుడే శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయేల్‌కి మద్దతునివ్వడాన్ని తప్పుబట్టారు. గత ప్రధాన మంత్రులను గుర్తు చేసుకున్న శరద్ పవార్...మొదటి నుంచి భారత ప్రధానులందరూ పాలస్తీనాకే మద్దతునిచ్చారని స్పష్టం చేశారు. శరద్‌ పవార్ చేసిన ఈ వ్యాఖ్యల్ని పలువురు బీజేపీ మంత్రులు ఖండించారు. 


ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో (UN General Assembly) ఇజ్రాయేల్, హమాస్‌ యుద్ధంపై కీలక చర్చ జరిగింది. ఇప్పటికిప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించడంతో పాటు దాడులు ఆపేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. గాజా సరిహద్దు ప్రాంతంలోని ప్రజలకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలనీ పిలుపునిచ్చారు. దీనిపై ఓటింగ్ కూడా నిర్వహించారు. అయితే...ఈ ఓటింగ్‌కి భారత్‌ దూరంగా ఉంది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై (Israel Hamas War) దాడులకు దిగారు. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. గాజానే టార్గెట్‌గా చేసుకుని ఇజ్రాయేల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. UNGA లోని 193 సభ్య దేశాలు Emergency Special Session నిర్వహించాయి. 


Also Read: దొంగతనాలు, అత్యాచారాల్లో ముస్లింలే నంబర్ వన్ - ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు