Delhi Crime: 



దారుణ హత్య..


ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ 24 ఏళ్ల యువతిని ఇంట్లోనే కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. జైత్పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. వెంటనే హాస్పిటల్‌కి తరలించినప్పటికీ అప్పటిక ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధరించారు. అక్టోబర్ 27 రాత్రి 9 గంటలకు ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు పెట్టుకుని ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తరవాత యువతిపై కాల్పులు జరిపారు. మృతురాలి పేరు పూజా యాదవ్‌గా వెల్లడించారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆ యువతి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరారవుతున్నారు. వాళ్లను వెంబడించారు. వాళ్లు వచ్చిన బైక్‌ని స్వాధీనం చేసుకున్నప్పటికీ వాళ్లు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఈ బైక్‌ని సీజ్ చేశారు. అయితే...ఆ బైక్‌కి నంబర్ ప్లేట్ లేదు. ప్రస్తుతం ఆ ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నారు. 


స్విట్జర్లాండ్‌కి చెందిన మహిళ ఇటీవల ఢిల్లీలో దారుణ హత్యకు గురైంది. వెస్ట్ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో ఆమె డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. మృతురాలి పేరు లీనా బెర్గర్‌గా గుర్తించారు. ఓ గవర్నమెంట్ స్కూల్‌ సమీపంలో మృతదేహం లభ్యమైంది. చెత్త వేసే బ్లాక్‌ కవర్‌లో ఆమె బాడీని కుక్కి పెట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నిందితుడికి, ఆ మహిళకు స్విట్జర్లాండ్‌లో పరిచమయైంది. అక్కడే ఇద్దరూ స్నేహితులయ్యారు. నిందితుడు గుర్‌ప్రీత్‌ తరచూ స్విట్జర్లాండ్‌కి వెళ్లి లీనాని కలిసేవాడు. అయితే...ఆ మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానించాడు. ఈ కోపంతోనే ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఇండియాకి రావాలని కాల్ చేశాడు. అక్టోబర్ 11న ఆమె ఇండియాకి వచ్చింది. ఐదు రోజుల తరవాత లీనాని రూమ్‌కి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే ఆమెను బంధించాడు. చేతులు, కాళ్లు కట్టేసి హత్య చేశాడు. ఆమె డెడ్‌బాడీని కార్‌లో దాచాడు. కాసేపటి తరవాత కార్‌లో నుంచి దుర్గంధం వచ్చింది. దొరికిపోతానేమో అన్న భయంతో కార్‌లో తిలక్‌నగర్ వరకూ వెళ్లి రోడ్‌ సైడ్‌లో బాడీని పారేసి అక్కడి నుంచి పారిపోయాడు. కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌ ద్వారా నిందితుడిని గుర్తించారు. CC కెమెరాల ఫుటేజ్‌నీ గమనించారు. వెంటనే కార్‌ని సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఇంట్లో రూ.2.5 కోట్ల నగదుని సీజ్ చేశారు.


అంతకు ముందు ఓ 42 ఏళ్ల వ్యక్తిని యువకుడు హత్య చేసి ఇంట్లోనే పాతి పెట్టాడు. ఆ తరవాత దానిపై సిమెంట్‌ పోసి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు...పోలీసుల విచారణలో దొరికిపోయాడు. సెప్టెంబర్ 2వ తేదీన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఆఫీసర్ మహేశ్ కుమార్ ఆగస్టు 29 నుంచి కనిపించకుండా పోయాడు. అదే ఆఫీస్‌లో క్లర్క్‌గా పని చేస్తున్న అనీస్‌ ఆయనను హత్య చేశాడు.


Also Read: రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం, ముకేశ్ అంబానీకి బెదిరింపులు