Fastag Scam Fact Check: ఫాస్టాగ్ స్కామ్ అంటూ ఈ మధ్య కాలంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ పడిన వెంటనే కొంత మంది వచ్చి కారు అద్దారు తుడుస్తూ ఈ ఫాస్టాగ్‌లోని డబ్బులు కొట్టేస్తున్నారని ఆ వీడియోలో చూపించారు. ముఖ్యంగా పేటీఎంతో లింక్ అయి ఉన్న అకౌంట్స్‌కు ఈ సమస్య ఉందని హెచ్చరించారా వీడియోలో.
ఆ వీడియోలో ఇంకా ఏముంది అంటే..
వాట్సాప్‌తోపాటు ఇతర సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బాలుడు కారు అద్దాలు తుడుస్తూ ఉంటాడు. కారులోపల కూర్చొని ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ వీడియోనూ రికార్డ్ చేస్తారు. ఆ బాలుడు కూడా తన చేతికి ఓ స్మార్ట్ వాచ్‌ను కట్టుకొని ఉంటాడు. అద్దాలు తుడుస్తూనే.. కారులో ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తాడు.
ఇలా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అద్దాలు క్లీన్ చేసే వాళ్లు తమ పని పూర్తైన తర్వాత డబ్బులు అడుగుతారు. కానీ ఆ వీడియోలో బాలుడు మాత్రం డబ్బులు అడక్కుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాలుడు డబ్బులు అడక్కపోయేసరికి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తికి డౌట్ వస్తుంది. ఎందుకు ఆ పిల్లాడు డబ్బులు అడగుకుండానే వెళ్లిపోయాడని పక్కనే కూర్చొని ఉన్న తన స్నేహితుడిని అడుగుతాడు. ఆ పిల్లాడు తన చేతికి స్మార్ట్ వాచ్ కట్టుకొని ఉన్నాడని... గుర్తించిన ఆ కారులోని వ్యక్తి పిల్లాడని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. వాళ్లు వస్తున్న సంగతి గుర్తించిన ఆ పిల్లాడు అక్కడి నుంచి వాళ్లకు దొరక్కుండా పరిగెత్తివెళ్లిపోతాడు.
తర్వాత కారులోకి వచ్చి కూర్చున్న డ్రైవర్ ఫ్రెండ్ ఈ మోసం ఎలా జరుగుతుందో వివరిస్తాడు. అద్దాలు క్లీన్ చేస్తున్నట్టు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తారని... తర్వాత పేటీఎం వాలెట్ నుంచి చెల్లింపులు చేసే వారి ఖాతాల నుంచి డబ్బులు తీసుకుంటారని వివరిస్తాడు.
ఇది కాస్త వైరల్ అవ్వడంతో ఫాస్టాగ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి స్కామ్‌లు జరగడానికి అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇది టోల్‌ప్లాజా, పార్కింగ్ ప్లాజా వాళ్లు మాత్రమే ఇందులో డబ్బులు డ్రా చేసుకునే వీలుందని వేరే వాళ్లకు ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పింది. వేరే డివైస్‌ల ద్వారా ఫాస్టాగ్స్ స్టిక్కర్స్ నుంచి డబ్బులు వీలుపడదని... ఇది వందకు వందశాతం సురక్షితమని ట్వీట్ చేసింది.
కేంద్ర సమాచార శాఖ కూడా దీనిపై రియాక్ట్ అయింది. ఇది ఫేక్ స్కామ్ అని చెప్పుకొచ్చింది. ప్రతి టోల్‌ప్లాజాకు ఓ ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని... దాన్ని ఓ బ్యాంక్‌కు లింక్ చేసి ఉంటుందన్నారు. దానికి జియో కోడ్ కూడా ఉంటుదని వివరించారు.
అందుకే ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు. ఇలాంటివి ఫార్వర్డ్ చేసినా... షేర్ చేసినా మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా కల్పితమైంది. అలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలుండదు.