ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు వచ్చేస్తున్నాయ్..


అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేసేందుకు, వ్యక్తిగత వివరాలకు భద్రత పెంచేందుకు కేంద్రం కొత్తగా ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేయనుంది. గతేడాదే ఈ-పాస్‌పోర్ట్‌ల అంశాన్ని కేంద్రం ప్రస్తావించగా..ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి ఈ అంశంపై చర్చించారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తామని వెల్లడించారు. భారత పౌరులు విదేశీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు. ఏటా జూన్‌ 24వ తేదీన పాస్‌పోర్ట్ సేవా దివస్ జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారులతో సమావేశమయ్యారు జై శంకర్. పాస్‌పోర్ట్‌ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి, పౌరులకు ఉత్తమ సేవలు అందించాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 


నిజానికి చిప్‌తో కూడిన పాస్‌పోర్ట్‌లను జారీ చేయటం కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇప్పటికే 100కి పైగా దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఐర్‌లాండ్, జింబాబ్వే, మాల్వాయ్ లాంటి దేశాలు ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తున్నాయి. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇంతకీ చిప్‌ బేస్డ్ పాస్ట్‌పోర్ట్‌లు అంటే ఏంటి..? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? అంతర్జాతీయ ప్రయాణాన్ని ఇది ఏమేర సౌకర్యవంతంగా మార్చుతుంది..? ఈ వివరాలు తెలుసుకుందాం. 


ఈ-పాస్‌పోర్ట్ అంటే..


ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు చూడటానికి సాధారణ పాస్‌పోర్ట్‌ల్లానే కనిపిస్తాయి. కాకపోతే వీటి లోపల చిప్‌ను అమర్చుతారు. డ్రైవర్ లైసెన్స్‌ కార్డ్‌లో ఎలాగైతే చిప్ ఉంటుందో అలాగే పాస్‌పోర్ట్‌కూ చిప్‌ను పెడతారు. పాస్‌పోర్ట్‌ వినియోగదారుడి అన్ని వివరాలు అందులో రికార్డ్ అయ్యుంటాయి. ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్‌ ఆధారంగా ఈ-పాస్‌పోర్ట్ పని చేస్తుంది. ఈ పాస్‌పోర్ట్ వెనక భాగంలో యాంటెనా ఉంటుంది. ఈ చిప్‌ ద్వారా ప్రయాణికుడి వివరాలను క్షణాల్లో వెరిఫై చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. నకిలీ పాస్‌పోర్ట్‌ల సమస్యనూ తీర్చుతుంది. 


ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి..? 


టాటా కన్సల్టెన్సీ సంస్థ ఈ ఎలక్ట్రానిక్ చిప్‌లను తయారు చేయనుంది. ఈ ఏడాది చివర్లోగా వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పటికే సాధారణ పాస్‌పోర్ట్‌లు ఉన్న వాళ్లు ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లకు అప్‌గ్రేడ్ అవ్వాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. సాధారణ పాస్‌పోర్ట్‌లలాగానే వీటిని కూడా జారీ చేస్తారని, ఈ ప్రక్రియలో ఎలాంటి మార్పూ ఉండదని ప్రభుత్వంవెల్లడించింది. ఈ ఈ-పాస్‌పోర్ట్‌లు అందుబాటులోకి వచ్చాక...కొత్తగా పాస్‌పోర్ట్‌కు అప్లై చేసే వాళ్లకు చిప్‌తో కూడినవే జారీ చేస్తారు. నకిలీ పాస్‌పోర్ట్‌లను అరికట్టడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 


Also Read: Govt Teachers Properties : పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం, టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు


Also Read: Flood Proof House - వీడియో: ఈ ఇల్లు వరదల్లో మునగదు, చుక్క నీరు కూడా ఇంట్లోకి చేరదు