Hindupur Ysrcp Politics : రాష్ట్రమంతా ప్రభుత్వ విధానాలపై టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా హిందూపురం తెలుగుదేశం నాయకులకు చేతిలో పనిలేకుండా పోయింది. అందుకు కారణం వీరు చేయాల్సిన పని కూడా వైసీపీలోని మరో వర్గం చేస్తూ వీరికి విశ్రాంతి కల్పిస్తోంది. హిందూపురంలోని వైసీపీ లోకల్, నాన్ లోకల్ పాలిటిక్స్ తో నిలువునా చీలిపోయింది. ఎలాగైనా సహాయ నిరాకరణ చేసి ఎమ్మెల్సీ ఇక్బాల్ ను హిందూపురం నుంచి సాగనంపాలని అక్కడి నాయకులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు చేస్తున్నారు. శుక్రవారం ఒక అడుగు ముందుకేసి  ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న ఓ వర్గంపై మరో వర్గం రాళ్ల దాడికి పాల్పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపచేయడంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది.


అధిష్ఠానంపై అసహం


ఇవాళ హిందూపురం నియోజకవర్గం వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని అట్టర్ ఫ్లాప్ చేసి ఎమ్మెల్సీ ఇక్బాల్ హిందూపురంలో పట్టు కోల్పోయారన్న సంకేతాలను అధిష్టానం దృష్టికి పంపించే ఆలోచనలో స్థానిక నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హిందూపురం నియోజకవర్గం మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, అబ్దుల్ గని,  నవీన్ నిశ్చల్, చెవలూరి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరాం రెడ్డి,  ఎంపీపీ పురుషోత్తం రెడ్డి, మరో ఎంపీపీ రత్నమ్మ,  సుమారు పదిహేను మంది మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ఇతర నాయకులు వేరు కుంపటిగా విడిపోయారు. నాన్ లోకల్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల అధిష్టానంపై గుర్రుగా  ఉన్నప్పటికీ చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు.


ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంట్రీపై 


నాన్ లోకల్ నాయకుడైన ఇక్బాల్ కు సహాయ నిరాకరణ చేసి తమ ఆలోచనను అధిష్టానానికి  తెలియపరచాలని స్థానిక నేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇదే ఆలోచన మొదటి నుంచి ఉన్నప్పటికీ వ్యతిరేక వర్గంలో అనైక్యత కారణంగా ఈ అంశాలు తెరపైకి రాలేదు. అదును కోసం వేచి చూసిన ఈ కూటమి పెద్దలు గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని వేదిక చేసుకొని తమ వాణిని బహిర్గతం చేశారు. ఎన్నాళ్లని నాన్ లోకల్ నాయకుల కింద పనిచేయాలన్న అభిప్రాయంతో ఏకీభవించిన అసమ్మతి నేతలందరూ ఏకతాటి పైకి వచ్చి ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా జట్టు కట్టారు. ఇటీవల ఎమ్మెల్సీ ఇక్బాల్ విదేశాలకు వెళుతూ గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ బాధ్యతను అప్పటివరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు అప్పజెప్పడంతో అసమ్మతి వర్గానికి అవకాశం దొరికినట్టు అయ్యింది. లోకల్ నాయకులకు కాకుండా బాధ్యతలను గోరంట్ల మాధవ్ కు ఇవ్వడం ఏంటన్న అంశంపై అసమ్మతి నాయకులు దశలవారీగా చర్చలు జరిపి క్యాంపు రాజకీయాలు నడిపారు. చివరకు ప్రెస్ మీట్ లు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. 


సజ్జలకు దృష్టికి 


ఈ విషయాలు సహించలేని ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గం హిందూపురం ప్రెస్ క్లబ్ లో అసమ్మతి వర్గం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో రాళ్ల దాడికి దిగారు. దీంతో మరింత రెచ్చిపోయిన అసమ్మతి వర్గం ముఖ్య నాయకులు తమ నిరసనను రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్లీనరీ సజావుగా జరిపి తమ ఐక్యతను నిరూపించుకోవాలన్న ఇక్బాల్ ఆశలకు గండి  పడింది. ఓ మెట్టు తగ్గి చిన్నస్థాయి నాయకులకు కూడా మాజీ పోలీసు బాస్ ఇక్బాల్ పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి  రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ అసమ్మతి వర్గం నాయకులు దిగి రావడం లేదు. సహాయనిరాకరణతో నాన్ లోకల్ నాయకులను సాగనంపుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా హిందూపూర్ లో లోకల్ నాన్ లోకల్ పాలిటిక్స్ కు ఎండ్ కార్డు వేసేందుకు అధిష్టానం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.