Dr. Tessy Thomas : మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా (missile man of india)కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా (missile woman of india) అంటే డాక్టర్ టెస్సీ థామస్ (Dr Tessy Thomas) వెంటనే గుర్తొస్తారు. డాక్టర్ టెస్సీ థామస్ ను అగ్ని పుత్రిక అని కూడా పిలుస్తారు. 


క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం మొదటి మహిళ
భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అగ్ని ప్రాజెక్ట్ బాధ్యతలను డాక్టర్ టెస్సీ థామస్‌ అప్పగించారు. 2011లో అగ్ని-3 క్షిపణి ప్రాజెక్ట్‌కి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, అగ్ని-4 క్షిపణి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. 2009లో అగ్ని 5 క్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో డీఆర్డీవో డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. పురుష-ఆధిపత్య రంగంలో మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించుకోవడమంటే మాములు విషయం కాదు. టెస్సీ థామస్ ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో అగ్ని-IV క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేశారు. భారత డిఫెన్స్‌లో బలమైన ఆయుధమైన అగ్ని సిరీస్‌లో టెస్సీ ప్రధానపాత్ర పోషించారు. కంట్రోల్, ఇనర్షియల్ నావిగేషన్, ట్రాజెక్టరీ సిమ్యులేషన్, మిషన్ డిజైన్ వంటి వివిధ రంగాలలో సహకారం అందించారు. అగ్ని క్షిపణులలో ఉపయోగించే సుదూర క్షిపణి వ్యవస్థల కోసం తయారు చేసిన టెక్నాలజీలోనూ టెస్సీ థామస్ ప్రధాన పాత్ర పోషించారు. 


రీ-ఎంట్రీ సిస్టమ్‌ను అభివృద్ధిలో కీలకపాత్ర
అగ్ని V భారతదేశానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. దాని 5,000-కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి దీన్ని డెవలప్ చేశారు. దేశ రక్షణకు కీలకమైన అగ్ని-5ను శక్తివంతంగా తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారు. 3వేల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, వేగాలను తట్టుకునేలా క్షిపణి కోసం రీ-ఎంట్రీ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. డాక్టర్ టెస్సీ థామస్ 2001లో డిఆర్‌డిఓ అగ్ని అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సెల్ఫ్-రిలయన్స్‌తో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2008లో డీఆర్డీవో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, 2011లో డీఆర్డీవో పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు ను సొంతం చేసుకున్నారు. 2009లో ఇండియా టుడే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. 


ఐఏఎస్ అవబోయి...అనూహ్యంగా డీఆర్డీవోలోకి ప్రవేశం
టెస్సీ థామస్ ఏప్రిల్ 1963లో కేరళలోని తతంపల్లిలో జన్మించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన డాక్టర్ టెస్సీ థామస్...చిన్నప్పటి నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీపై మక్కువ పెంచుకున్నారు. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ల  వద్ద రాకెట్లు చూసి వాటిపై ఆసక్తిపెంచుకున్నారు. సెయింట్ మైఖేల్ హైగర్ సెకండరీ స్కూల్ ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆమె...కాలికట్ విశ్వవిద్యాలయం నుంచి 1983లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో B.Tech చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో ఎంఈని పూర్తి చేశారు.2014లో హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీలో మిస్సైల్ గైడెన్స్‌లో పీహెచ్ డీ చేశారు. యూపీఎస్సీ పరీక్షలకు అటెండయ్యారు.  డీఆర్డీవో ఇంటర్వ్యూలో మొదటిసారే సక్సెస్ అయ్యారు. దీంతో ఆమెకు డీఆర్డీవోలో పని చేసే అవకాశం లభించింది.